gagan mahal
-
గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం
చిక్కడపల్లి: దోమలగూడ గగన్‌మహల్ కాలనీలో ఆదివారం గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్‌రావు కథనం ప్రకారం... గగన్‌మహల్ కాలనీలోని తులిప్ రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 201, 301ల్లో రంజీత్ సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 201 ఫ్లాట్‌లోని వంట గది నుంచి పొగ రావడంతో ఇంట్లోవారు బయటకు పరుగు తీయడంతో పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి అపార్ట్మెంట్ వాసులను కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫ్లాట్ నం. 201 పైన ఉన్న 301కి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా కష్టించి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రమాద తీవ్రత పెరగకుండా, అదే విధంగా ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా చాకచక్యంగా అపార్ట్మెంట్ వాసులను కిందకు తీసుకొచ్చిన ఎస్ఐలు ప్రేమ్‌కుమార్, పచ్చు బాల్‌రాజ్, సిబ్బంది వీరేందర్, భీంసింగ్, అరుణ్, శేఖర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. -
కోడిగుడ్డు సొన, బెల్లం మిశ్రమంలో
పెనుకొండ : రాజరికపు పుటల్లో చెక్కుచెదరని కట్టడాల్లో పెనుకొండ పట్టణంలోని గగన్‌మహల్ ఓ మధుర జ్ఙాపకంగా నిలిచింది. 14, 15, 16, 17 శతాబ్ధాల్లో ఓ వెలుగు వెలిగిన గగన్మమల్ నేడు మనకు నాటి తీపి గుర్తులను పంచుతోంది. ఇండో పార్సీయన్ ఆకారంలో గార, కోడిగుడ్డు సొన, బెల్లం, ఇసుక గవ్వలు, చలువరాయి మిశ్రమంలో దీన్ని నిర్మించారు. పోర్చుగీసు కాలంలో నిర్మించిన ఈ గగన్‌మహల్‌ను అనంతరం 14వ శతాబ్ధంలో మల్లికార్జున రాయలు, వీరవిజయరాయలు, ప్రతాపరుద్ర రాయలు ఎంతో అభివృద్ధి చేశారు. దీన్ని వేసవి విడిదిగా అప్పటి రాజులు వినియోగించే వారు. శత్రుదుర్భేధ్యమైన కట్టడంగా, రాజుల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైభాగంలో పెద్దఎత్తున పహారా కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు. సైనికులు దీనిద్వారా సుదూరం నుంచి వచ్చే శత్రువులను కనిపెట్టే సౌకర్యం ఇందులో ఉండటం విశేషం. 300 సంవ త్సరాలకు పైగా అప్పటి రాజులు దీన్ని వాడుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 26 మంది చక్రవర్తులు గగన్‌మహల్‌ను కేంద్రబిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన సాగించారట. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సైతం ఉన్నారు. పెనుకొండకు ప్రత్యేక స్థానమిచ్చిన రాయలు 1509 నుంచి 1523 వరకు పాలన సాగించిన కృష్ణదేవరాయలు హంపీ తరువాత అంతటి ప్రాధాన్యతను పెనుకొండకు ఇచ్చారు. ప్రతినెలా మూడు నెలల పాటు ఇక్కడి నుంచే ఆయన పాలన సాగించే వారని, కొండపై సైతం అనునిత్యం లక్ష్మీనరసింహస్వామిని పవిత్రంగా పూజించడమే కాదు కొండపై ఆలయాన్ని కూడా నిర్మించారు. గగన్‌మహల్ నుంచి కొండపైకి రహస్య మార్గాలు ఉండేవి. నేటికీ ఆ రహస్య మార్గాలు ఉన్నా ప్రమాదమని ప్రభుత్వం వాటిని మూసివేయించింది. చల్లదనం దీని ప్రత్యేకం గగన్‌మహల్ యొక్క ప్రత్యేకం చల్లదనాన్ని కలిగించడమే. విభిన్న మిశ్రమాలతో నిర్మించడంతో ఏ కాలంలో అయినా చల్లదనాన్ని కలిగిస్తుంది. నాటి రాజరికపు గుర్తులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఎలా వెళ్లాలంటే... ఈ కట్టడాన్ని సందర్శించాలంటే అనంతపురం వైపు నుంచి పెనుకొండకు చేరుకుంటే ఆటోలో సులువుగా వెళ్ళవచ్చు. జిల్లా కేంద్రం నుంచి 75 కిలో మీటర్ల దూరం ఉంది. దీన్ని సందర్శకుల కోసం నిత్యం తెరిచే ఉంచుతారు. అలాగే బెంగళూరు, హిందూపురం వైపు నుంచి పెనుకొండకు అనేక బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వస్తే మరెన్నో కట్టడాలు, నాటి రాజరికపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. -
పర్యాటక ప్రియులకు స్వర్గధామం
పెనుకొండ : విజయనగర రాజుల రెండవ రాజధాని పెనుకొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తోంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం. కొండ పై భాగంలో శత్రుదుర్బేధ్యమైన ‘ఖిల్లా’ నిర్మించారు. ఖిల్లాపై నుంచి శత్రువుల రాకను కిలోమీటర్ల దూరం నుంచే కనిపెట్టేవారు. నరసింహస్వామి దేవాలయం.. కొండపై బ్రహ్మతీర్థము (కొలను)కు దక్షిణంగా శ్రీవేట్రాయుడు అని పిలిచే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించారు. తను ఎంతగానో పూజించే నరసింహస్వామి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తెల్లవారుజామునే కృష్ణదేవరాయలు ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానమాచరించి తడి గుడ్డలతోనే మంటపాల కిందుగా వెళ్లి నరసింహస్వామిని పూజించేవాడని భక్తుల నమ్మకం. గగన్‌మహల్.. పెనుకొండ రాజరికపు చరిత్రలో విలువైన కట్టడాల్లో గగన్‌మహల్ ప్రధానమైనది. ఇక్కడ విజయనగర రాజులు పాలన సాగించినా వీరికి మునుపే ఈ కట్టడాన్ని నిర్మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణంలోని ఊరువాకిలి ఆంజనేయస్వామి దేవాలయం, పవిత్రబాబయ్య దర్గా, జైన మతాన్ని ప్రతిబింబించే జైన ఆలయాలు, శివాలయాలు, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా విశాలమైన బావులు, కోటగోడలు, 365 దేవాలయాలు ఇతర కట్టడాలు పెనుకొండ పుణ్య చరిత్రను తెలుపుతాయి. విజయనగర రాజుల పాలనకు పెనుకొండ కేంద్రబిందువు కావడంతో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహం సైతం ఏర్పాటు చేశారు. ఇలా చేరుకోవచ్చు.. జిల్లా కేంద్రం అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. బెంగళూరు, లేక హిందూపురం వెళ్ళే ఏ బస్సయినా ఇక్కడ నిలుపుతుంది. కాచిగూడ, ప్యాసింజర్, ప్రశాంతి తదితర రైళ్లలోనూ చేరుకోవచ్చు.