పర్యాటక ప్రియులకు స్వర్గధామం
పెనుకొండ : విజయనగర రాజుల రెండవ రాజధాని పెనుకొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తోంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం. కొండ పై భాగంలో శత్రుదుర్బేధ్యమైన ‘ఖిల్లా’ నిర్మించారు. ఖిల్లాపై నుంచి శత్రువుల రాకను కిలోమీటర్ల దూరం నుంచే కనిపెట్టేవారు.
నరసింహస్వామి దేవాలయం..
కొండపై బ్రహ్మతీర్థము (కొలను)కు దక్షిణంగా శ్రీవేట్రాయుడు అని పిలిచే లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించారు. తను ఎంతగానో పూజించే నరసింహస్వామి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. తెల్లవారుజామునే కృష్ణదేవరాయలు ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానమాచరించి తడి గుడ్డలతోనే మంటపాల కిందుగా వెళ్లి నరసింహస్వామిని పూజించేవాడని భక్తుల నమ్మకం.
గగన్‌మహల్..
పెనుకొండ రాజరికపు చరిత్రలో విలువైన కట్టడాల్లో గగన్‌మహల్ ప్రధానమైనది. ఇక్కడ విజయనగర రాజులు పాలన సాగించినా వీరికి మునుపే ఈ కట్టడాన్ని నిర్మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణంలోని ఊరువాకిలి ఆంజనేయస్వామి దేవాలయం, పవిత్రబాబయ్య దర్గా, జైన మతాన్ని ప్రతిబింబించే జైన ఆలయాలు, శివాలయాలు, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా విశాలమైన బావులు, కోటగోడలు, 365 దేవాలయాలు ఇతర కట్టడాలు పెనుకొండ పుణ్య చరిత్రను తెలుపుతాయి. విజయనగర రాజుల పాలనకు పెనుకొండ కేంద్రబిందువు కావడంతో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహం సైతం ఏర్పాటు చేశారు.
ఇలా చేరుకోవచ్చు..
జిల్లా కేంద్రం అనంతపురానికి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. బెంగళూరు, లేక హిందూపురం వెళ్ళే ఏ బస్సయినా ఇక్కడ నిలుపుతుంది. కాచిగూడ, ప్యాసింజర్, ప్రశాంతి తదితర రైళ్లలోనూ చేరుకోవచ్చు.