అమరాపురం : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 5.30 గంటలకు శ్రీనివాస్(30) డీఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి బస్సులో బయలు దేరాడు. మడకశిరలో స్నేహితుడి కోసం దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. పెనుకొండ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని హేమావతి గ్రామానికి తీసుకువచ్చారు. తల్లి సరోజమ్మ, భార్య శశికళ, అక్క అనిత, బంధువులు రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే పరలోకానికి వెళ్లిపోయావా అంటూ భార్య, తల్లి రోధించారు.
తల్లడిల్లిన పల్లెలు
మడకశిర ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంతో పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాల్లో విషాద వాతావరణం ఏర్పడింది. మా పిల్లవాడు కళాశాలకు బస్సులో వెల్లాడు, మా పాప కళాశాలకు వెల్లింది, ఎమైందో అంటూ పరుగు పరుగున ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఎక్కడ ఉన్నారోనని కన్నీరు పెట్టుకుంటూ తాపత్రయ పడడం కనిపించింది. విషాదంతో ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సంతోషంతో చదువుకోవడానికి వెళ్లిన తమ బిడ్డలు ఏమయ్యారోనని వారు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రమాదంలో గాయపడిన వారిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి సీఐ రాజేంద్రనాథ్యాదవ్, ఎస్‌ఐ శేఖర్ సిబ్బందితో పాటు స్థానికులు క్షతగాత్రులను అనంతపురం, హిందూపురం ఆస్పత్రులకు స్కూల్ బస్సులు, జీపుల్లో తరలించడానికి ముమ్మర చర్యలు చేపట్టారు.
మరవలేని విషాద ఘటన
పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం జీవితంలో మరిచిపోలేని విషాద ఘటన అని పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, ఆరైఓ వెంకటేశులు, డీవైఈఓ వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ఉదయం ప్రమాద ఘటనలో తమ కళాశాల విద్యార్థులు చనిపోయారన్న సమాచారం అందడంతో చలించిపోయిన వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి కంటతడిపెట్టుకున్నారు. ఆర్డీఓ రామమూర్తి మాట్లాడుతూ ప్రమాద ఘటన ఘోరమని పేర్కొన్నారు. విశిష్ట సేవలు అందించిన 108 సిబ్బంది: పెనుకొండ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో 108 సిబ్బంది విశేష సేవలు అందించారు.
డీఎస్సీ దరఖాస్తు కోసం వెళ్తూ..
Published Thu, Jan 8 2015 9:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM
Advertisement
Advertisement