Madakasira bus accident
-
వైద్యం అందితే నా కొడుకు బతికేవాడు..
హిందూపురం : సకాలంలో వైద్యం అందించి ఉంటే తన కొడుకు బతికేవాడని ఇంటర్ విద్యార్ధి గంగాధర్ తండ్రి ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆయన తన బాధను వివరించారు. తీవ్రంగా గాయపడి చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకువచ్చి.. పిల్లాడు చాలా బాధపడుతున్నాడు త్వరగా రండి.. అని డాక్టర్‌కు ప్రాధేయపడితే ఆయన కసురుకున్నాడని వాపోయాడు. వెంటనే వైద్యం అందించి వుంటే నా కొడుకు బతికేవాడని విలపించాడు. ఏ శవ పరీక్షలు వద్దు.. పిల్లాడి శవం ఇచ్చేయండి వెళిపోతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాయకులు ఆయనను శాంత పరిచారు.అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృత్యుంజయురాలు అనిత అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో మేకలపల్లికి చెందిన అనిత అనే విద్యార్థిని మృత్యుంజయురాలుగా సురక్షితంగా బయటపడింది. ఘటనపై ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... నేను పెనుకొండలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్రతిరోజూ మా గ్రామం నుంచి 30 మందికి పైగా విద్యార్థులం ఈ బస్సులో పెనుకొండకు వస్తూ ఉంటాం. రోజులాగే మా గ్రామానికి చెందిన విద్యార్థులు బధవారం ఉదయం 8 గంటలకు బస్సు ఎక్కాము. బస్సు డ్రయివర్ వేగంగా నడుపుతూ వచ్చాడు. బస్సులోని ప్రయాణికులతోపాటు కండక్టర్ కూడా నెమ్మదిగా పోనివ్వాలని చెప్పారు. బస్సుకు ఆటో అడ్డురావడంతోనే దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురిచేశాడు. బస్సు లోయలో పడిన విషయం మాత్రమే తెలుసు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. మా టీచర్ బాలాజీ నన్ను లేపిబయటకు పంపాడు. నాతోపాటు మరో పది మందిని కాపాడాడని ఆమె వివరిచింది. -
డీఎస్సీ దరఖాస్తు కోసం వెళ్తూ..
అమరాపురం : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 5.30 గంటలకు శ్రీనివాస్(30) డీఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి బస్సులో బయలు దేరాడు. మడకశిరలో స్నేహితుడి కోసం దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. పెనుకొండ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని హేమావతి గ్రామానికి తీసుకువచ్చారు. తల్లి సరోజమ్మ, భార్య శశికళ, అక్క అనిత, బంధువులు రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే పరలోకానికి వెళ్లిపోయావా అంటూ భార్య, తల్లి రోధించారు. తల్లడిల్లిన పల్లెలు మడకశిర ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంతో పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాల్లో విషాద వాతావరణం ఏర్పడింది. మా పిల్లవాడు కళాశాలకు బస్సులో వెల్లాడు, మా పాప కళాశాలకు వెల్లింది, ఎమైందో అంటూ పరుగు పరుగున ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఎక్కడ ఉన్నారోనని కన్నీరు పెట్టుకుంటూ తాపత్రయ పడడం కనిపించింది. విషాదంతో ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సంతోషంతో చదువుకోవడానికి వెళ్లిన తమ బిడ్డలు ఏమయ్యారోనని వారు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రమాదంలో గాయపడిన వారిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, ఎస్ఐ శేఖర్ సిబ్బందితో పాటు స్థానికులు క్షతగాత్రులను అనంతపురం, హిందూపురం ఆస్పత్రులకు స్కూల్ బస్సులు, జీపుల్లో తరలించడానికి ముమ్మర చర్యలు చేపట్టారు. మరవలేని విషాద ఘటన పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం జీవితంలో మరిచిపోలేని విషాద ఘటన అని పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, ఆరైఓ వెంకటేశులు, డీవైఈఓ వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ఉదయం ప్రమాద ఘటనలో తమ కళాశాల విద్యార్థులు చనిపోయారన్న సమాచారం అందడంతో చలించిపోయిన వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి కంటతడిపెట్టుకున్నారు. ఆర్డీఓ రామమూర్తి మాట్లాడుతూ ప్రమాద ఘటన ఘోరమని పేర్కొన్నారు. విశిష్ట సేవలు అందించిన 108 సిబ్బంది: పెనుకొండ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో 108 సిబ్బంది విశేష సేవలు అందించారు. -
రైలు ప్రమాదం మరువకముందే..
పెనుకొండ : మండలంలోని మడకశిర ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిన రెండో పెద్ద ప్రమాదంగా నమోదైంది. 20 12 ఏప్రిల్ 24న స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో హంపీ ఎక్స్‌ప్రెస్ నిలచి ఉన్న గూడ్స్ రై లును ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఆ ఘటనను మరువకముందే ఈ ఘోరం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ప్రమాదంల పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, మడకశిర ప్రాంత ప్రజలను శోక సంద్రంలో ముంచింది. 14 ఏళ్ల క్రితం ప్రస్తుతం బస్సు పడిన ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు పడి 10 మంది దాకా మరణించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. సహాయక చర్యలకు ప్రత్యేక సెల్ పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన వెంట నే 18004256401 నంబర్‌తో సెల్‌ను ప్రారంభిం చారు. దీని ద్వారా క్షతగాత్రులు ఎవరెవరు చికిత్స పొందుతున్నారు.. తదితర వివరాలను బంధువులకు అందిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పతిలో 16 మంది, హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. హిందూపురంలో చికిత్స పొందుతూ బండ్లపల్లికి చెందిన గంగాధర్, హేమావతికి చెందిన శ్రీనివాసులు మృతి చెందారని వివరించారు. ఈ ప్రత్యేక సెల్ మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు తెలిపారు.