వైద్యం అందితే నా కొడుకు బతికేవాడు..
హిందూపురం : సకాలంలో వైద్యం అందించి ఉంటే తన కొడుకు బతికేవాడని ఇంటర్ విద్యార్ధి గంగాధర్ తండ్రి ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆయన తన బాధను వివరించారు. తీవ్రంగా గాయపడి చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకువచ్చి.. పిల్లాడు చాలా బాధపడుతున్నాడు త్వరగా రండి.. అని డాక్టర్‌కు ప్రాధేయపడితే ఆయన కసురుకున్నాడని వాపోయాడు. వెంటనే వైద్యం అందించి వుంటే నా కొడుకు బతికేవాడని విలపించాడు. ఏ శవ పరీక్షలు వద్దు.. పిల్లాడి శవం ఇచ్చేయండి వెళిపోతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాయకులు ఆయనను శాంత పరిచారు.అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
మృత్యుంజయురాలు అనిత
అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో మేకలపల్లికి చెందిన అనిత అనే విద్యార్థిని మృత్యుంజయురాలుగా సురక్షితంగా బయటపడింది. ఘటనపై ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... నేను పెనుకొండలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్రతిరోజూ మా గ్రామం నుంచి 30 మందికి పైగా విద్యార్థులం ఈ బస్సులో పెనుకొండకు వస్తూ ఉంటాం. రోజులాగే మా గ్రామానికి చెందిన విద్యార్థులు బధవారం ఉదయం 8 గంటలకు బస్సు ఎక్కాము. బస్సు డ్రయివర్ వేగంగా నడుపుతూ వచ్చాడు. బస్సులోని ప్రయాణికులతోపాటు కండక్టర్ కూడా నెమ్మదిగా పోనివ్వాలని చెప్పారు. బస్సుకు ఆటో అడ్డురావడంతోనే దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురిచేశాడు. బస్సు లోయలో పడిన విషయం మాత్రమే తెలుసు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. మా టీచర్ బాలాజీ నన్ను లేపిబయటకు పంపాడు. నాతోపాటు మరో పది మందిని కాపాడాడని ఆమె వివరిచింది.