కూతురు.. అల్లుడు.. ఓ సవిత! | BK Family Exploitation In Anantapur | Sakshi
Sakshi News home page

బీకే కుటుంబ దోపిడీ

Published Sun, Jun 16 2019 8:18 AM | Last Updated on Sun, Jun 16 2019 1:56 PM

BK Family Exploitation In Anantapur - Sakshi

సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్‌: ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్‌ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు పిండి చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు.

సోమందేపల్లి మండలం గూడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 64లో నాలుగు హెక్టార్ల స్థలంలో క్వారీకి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కుమార్తె బీకే రోజా పేరిట 2015 జూలై 4న లీజుకు తీసుకున్నారు. అయితే ఇక్కడ క్వారీకి పర్యావరణ అనుమతుల్లేవు. అయినప్పటికీ నాలుగేళ్లుగా అక్రమ తవ్వకం కొనసాగుతోంది. బీకే పార్థసారధి అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్వారీకి సంబంధించి 20వేల క్యూబిక్‌ మీటర్లకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 2లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైనే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

రొద్దం మండలం కొగిరి గ్రామంలోని 454, 456–2 సర్వే నెంబర్లలో బీకే సాయి కన్‌స్ట్రక్షన్స్‌ పేరిట ఐదు హెక్టార్ల రోడ్డు మెటల్‌ క్వారీ నిర్వహణకు బీకే పార్థసారధి అల్లుడు పి.శశిభూషణ్‌ అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీకి నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే దీనికి తోడు అదే గ్రామ సర్వే నంబర్‌ 456లో 2017లో వెయ్యి క్యూబిక్‌ మీటర్లకు మాత్రమే తాత్కాలిక పర్మిట్‌ పొంది తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ సైతం తాత్కాలిక పర్మిట్‌ పొందేందుకు భూగర్భ గనుల శాఖ అధికారులపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముసుగులో కొన్ని వేల క్యూబిక్‌ మీటర్లను అక్రమంగా తవ్వేశారు.


కియా పరిశ్రమ పక్కన తాత్కాలిక పర్మిట్లతో ఎస్‌.సవిత పేరిట నిర్వహిస్తున్న క్వారీ

పెనుకొండ మండలం మునిమడుగు సర్వేనంబర్‌ 152లో నిర్వహిస్తున్న ఈ రోడ్డు మెటల్‌ క్వారీ కియా పరిశ్రమ పక్కనే ఉంది. నిబంధనల మేరకు పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి.అయితే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి అండదండలతో కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.సవిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూడు తాత్కాలిక పర్మిట్లు పొందారు. పర్మిట్లను మించి ఇప్పటికే 80వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రతీ క్వారీకి తాత్కాలిక పర్మిట్లను పొందారు. పార్థసారధి కూతురు రోజా పేరిట నిర్వహిస్తున్న క్వారీకి అసలు అనుమతులే లేకపోవడం గమనార్హం. కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.సవితమ్మ పేరిట ఓ క్వారీ లీజుకు తీసుకోగా.. కియా పరిశ్రమ సమీపంలో మూడు తాత్కాలిక పర్మిట్లతో పెద్ద ఎత్తున కొండలను పిండి చేస్తున్నారు. 

నిబంధనల మేరకు లీజు ఒక చోట తీసుకోవడం, తవ్వకాలు మరో చోట చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వం మారినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ దందా కొనసాగుతోంది. గనుల శాఖ నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక పర్మిట్లను ఇవ్వరాదు. క్వారీలకు లీజు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో బీకే పార్థసారధి నాకేంటి అడ్డు అన్నట్లుగా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి

తాత్కాలిక పర్మిట్ల ముసుగులో దోపిడీ 
అత్యవసర ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లను జారీ చేస్తారు. ఈ ముసుగులో బీకే కుటుంబ సభ్యులు దోరికినంతా దోచేశారు. ఎస్‌.సవితమ్మ 80వేల క్యూబిక్‌ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు తీసుకొని దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే రోడ్డు మెటల్‌ను తవ్వేశారు. 2015నుంచి నేటి వరకు ప్రతి క్వారీలోను అక్రమంగా తవ్వాలు చేపట్టినా గనులశాఖ అధికారులు చుట్టపు చూపుగా కూడా పరిశీలించలేదంటే ఏస్థాయిలో బీకే పార్థసారధి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. వీరి కనుసన్నల్లో నడుస్తున్న ఏ ఒక్క క్వారీని కనీసం తనిఖీ చేసే సాహసం కూడా అధికారులు చేయలేకపోయారు. వారు చెల్లించిందే రాయల్టీ అనే రీతిన క్వారీలను నిర్వహిస్తున్నారు. బీకే పార్థసారధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement