మనీ యర్నింగ్ కేంద్రాలుగా ‘మీ సేవ’లు | Money Yarning Centers mee seva | Sakshi
Sakshi News home page

మనీ యర్నింగ్ కేంద్రాలుగా ‘మీ సేవ’లు

Published Mon, Dec 30 2013 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Money Yarning Centers mee seva

పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, పాలనను ప్రజల చెంతకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాలు కొందరు అక్రమార్కులకు మనీ యర్నింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. సిబ్బంది చేతివాటం, కొందరు నిర్వాహకుల ధనాశ వెరసి మీసేవా వ్యవస్థ అభాసుపాలవుతోందని  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీ సేవా కేంద్రాలు నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి 125 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం కొత్తగా రిజిస్ట్రేషన్లను సైతం మీసేవకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్‌లో ఎంతో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఇలా ఉండగా గురువారం పెనుగొండ పోలీసులు మీసేవ కేంద్రాల ద్వారా జరుగుతున్న అవకతవకలను బయట పెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
 కొందరు నిర్వాహకులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటూ కొందరు అధికారులతో కుమ్మక్కై నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వం అందచేసే మోనోగ్రామ్‌లను నకిలీలకు అంటిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారి సంతకం కాగానే స్టాంపు వేసి ఇవ్వడానికి మీసేవా నిర్వాహకులకు అవకాశం ఉంది. ఈ అవకాశమే ఆదాయానికి ప్రధాన వనరుగా మారుతోంది. సంబంధిత అధికారుల సంతకాలు వారే చేస్తూ స్టాంపుని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మోనోగ్రాముల సంఖ్య, స్టాంపు వినియోగించిన వివరాలు ఆయా మండలాల్లోని తహసిల్దార్ కార్యాలయానికి అందించాల్సి ఉన్నా వాటిని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
 ఒక్క పిట్టల వేమవరం మీసేవా కేంద్రంలోనే నాలుగు నెలల కాలంలో 60 జనన ధ్రువీకరణ పత్రాలు, 100 ఓటరు గుర్తింపు కార్డులు, 50 నివాస ధ్రువీకరణ పత్రాలు నకిలీవి జారీ అయితే, జిల్లావ్యాప్తంగా ఉన్న మరికొన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చునన్న భావన వ్యక్తమవుతోంది. మీ సేవ కేంద్రాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి. బాబూరావు నాయుడు దృష్టికి పోలీసు అధికారులు తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో విస్తృత తనిఖీలు నిర్వహించి మీసేవ కేంద్రాల్లో అక్రమార్కులను పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement