'చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి'
పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహారదీక్ష రాష్ట్ర విభన కోరుకునేవిధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. చంద్రబాబు దీక్ష సమైక్యవాదానికి తూట్లుపొడిచేలావుందన్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు దీక్షలు, ఆత్మగౌరవ యాత్రలను ప్రజలు నమ్మేస్థితిలో లేదని చెప్పారు. 'తెలంగాణ నోట్'కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి.
మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాదయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. పెనుగొండలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 62వ రోజుకు చేరాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆకివీడు జాతీయ రహదారిపై 5000వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్తిలి బస్టాండ్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్న ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.