
రుణమాఫీపై సమాధానం చెప్పలేకపోతున్నాం
పెనుగొండ రూరల్: రుణమాఫీ అమలుపై రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నాం.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా అమలు చేయకపోవడం, దీనిపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం.. త్వరగా తేల్చాలని పలువురు టీడీపీ నాయకులు, రైతు సంఘాల నేతలు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలను ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులే ప్రశ్నల వర్షం కురిపించడంతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఆదివారం రాష్ట్ర మంత్రులు సునీత, సుజాత సిద్ధాంతం వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రుణమాఫీపై మంత్రులను పశ్నించారు. రుణమాఫీ అమలు జరుగుతుందని మంత్రులు సమాధానం చెప్పారు. అయితే, రైతు నాయకులు మాత్రం రుణమాఫీ అమలుకు విధించిన నియమ నిబంధనలు, ప్రధానంగా బీమా లబ్ధి ప్రభుత్వమే తీసుకుంటుందన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. బీమా సొమ్ము ప్రభుత్వం తీసుకుంటే రైతులకు రుణమాఫీయే అవసరం లేదన్నారు.
అంతేకాక ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ రైతులను అయోమయంలోకి నెడుతోందని, కౌలు రైతులకు, రైతుమిత్ర సంఘాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్యాయం జరుగుతుందని పలువురు నాయకులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతోందని వివరించారు. 2013 ఖరీఫ్‌లో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, బీమా పరిహారం రైతులకే అందేవిధంగా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యానశాఖ సర్వేలో కూరగాయల పంటలకు నిర్ణయించిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రులు చెప్పారు.