Peetala Sujatha
-
నారాయణ లాస్ట్.. పీతల ఫస్ట్
విజయవాడ: పనితీరును, అభివృద్ధి పనులపై అందించిన సమాచారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కీలకమైన రాజధాని భూసేకరణ, నిర్మాణ ఒప్పందాలు తదితర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణకు సీఎం చిట్టచివరి ర్యాంకు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కింది. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం ఆయా మంత్రులకు ఏయే ర్యాంకులు లభించాయో వెల్లడించినట్లు తెలిసింది. ఇతర మంత్రుల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.. దేవినేని ఉమ- 2, పత్తిపాటి పుల్లారావు- 3, కామినేని శ్రీనివాసరావు- 4, పరిటాల సునీత- 5, రావెల కిశోర్ బాబు- 6, అచ్చెన్నాయుడు- 7, గంటా శ్రీనివాసరావు- 8, కొల్లు రవీంద్ర- 9, అయ్యన్నపాత్రుడు- 10, పల్లె రఘునాథరెడ్డి- 11, మృణాళిని 13, పి. నారాయణ- 18వ ర్యాంకు పొందారు. గత ఆగస్టులోనూ ప్రభుత్వ పథకాల అమలు ప్రామాణికంగా టీడీపీ అధినేత మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాటి ర్యాంకుల్లో సీఎం చంద్రబాబుకు అనూహ్యంగా రాష్ట్రంలో 9వ ర్యాంక్ దక్కింది. -
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
-
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
హైదరాబాద్: ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ మారనట్లుగా కనిపిస్తోంది. బాక్సైట్ అంశంపై ఏపీ శాసనసభలో మంత్రి పీతల సుజాత ప్రకటన ఇచ్చినప్పటికీ, జీవో నంబర్ 97ను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనర్థం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదంటూ విశాఖ జిల్లాలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా జీవో నంబర్97 అనేది విశాఖ, మన్యం ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. గత కొన్ని రోజులుగా వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గిరిజనులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారు, కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడం గమనార్హం. -
అంచనాలను మించి భక్తుల రాక
పుష్కరఘాట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌తో కలసి బోటు ద్వారా పట్టణంలోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 11 రోజులుగా కోటీ 33 లక్షల మంది భక్తులు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. గురువారం వరకు జిల్లాలో కోటీ 20 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించగా శుక్రవారం మరో 13 లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టు ఆచరించినట్టు మంత్రి తెలిపారు. పుష్కరజ్యోతిని విజయవంతం చేయాలి పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగే పుష్కరజ్యోతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించి విజయవంతం చేయాలని మంత్రి పీతల సుజాత కోరారు. శుక్రవారం ఆమె కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కర ఏర్పాట్లపై భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పుష్కరజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటింటా దీపారాధన చేపట్టాలన్నారు. పుష్కరాలు విజయవంతంగా జరగడానికి ప్రజలు, అధికారులు, పాత్రికేయులు పూర్తి సహకారం అందించినట్టు మంత్రి సుజాత తెలిపారు. పుష్కరాల ఆఖరిరోజైన శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరస్నానానికి వస్తారని, వారి కోసం ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. పుష్కరాల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని సుజాత తెలిపారు. -
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం
చింతలపూడి : రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. గురువారం చింతలపూడి రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద జన్మభూమి-మాఊరు సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని సుజాత తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జన్మభూమి సభల్లో పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు స్వఛ్ఛాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. చింతలపూడిలో బస్‌డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు సుజాత తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత మంత్రిని, ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. సభలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు జరిపారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, ఎంపీడీవో వై.పరదేశికుమార్, తహసిల్దార్ టి.మైఖేల్‌రాజ్, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై సమాధానం చెప్పలేకపోతున్నాం
పెనుగొండ రూరల్: రుణమాఫీ అమలుపై రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నాం.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా అమలు చేయకపోవడం, దీనిపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం.. త్వరగా తేల్చాలని పలువురు టీడీపీ నాయకులు, రైతు సంఘాల నేతలు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలను ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులే ప్రశ్నల వర్షం కురిపించడంతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాష్ట్ర మంత్రులు సునీత, సుజాత సిద్ధాంతం వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రుణమాఫీపై మంత్రులను పశ్నించారు. రుణమాఫీ అమలు జరుగుతుందని మంత్రులు సమాధానం చెప్పారు. అయితే, రైతు నాయకులు మాత్రం రుణమాఫీ అమలుకు విధించిన నియమ నిబంధనలు, ప్రధానంగా బీమా లబ్ధి ప్రభుత్వమే తీసుకుంటుందన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. బీమా సొమ్ము ప్రభుత్వం తీసుకుంటే రైతులకు రుణమాఫీయే అవసరం లేదన్నారు. అంతేకాక ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ రైతులను అయోమయంలోకి నెడుతోందని, కౌలు రైతులకు, రైతుమిత్ర సంఘాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్యాయం జరుగుతుందని పలువురు నాయకులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతోందని వివరించారు. 2013 ఖరీఫ్‌లో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, బీమా పరిహారం రైతులకే అందేవిధంగా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యానశాఖ సర్వేలో కూరగాయల పంటలకు నిర్ణయించిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రులు చెప్పారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
భీమవరం : గోదావరి వరదకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆదివారం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించి వచ్చిన అనంతరం వారు భీమవరంలో ఎంపీ తోట సీతారామలక్ష్మి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వరదల కారణంగా పంట పొలాలు మునిగి దెబ్బతిన్నాయని వాటిని చూసి చలించిపోయానని చెప్పారు. బాధితులందరికీ ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. వరద బాధితులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసినట్టు చెప్పారు. సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గోదావరి తీర ప్రాంతంలో వరద నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పోలవరం నియోజకవర్గంలో పొగాకు, అరటి తోటలు, ఆచంట, పాలకొల్లు ప్రాంతాల్లో అరటి, తమలపాకు, కొబ్బరి, వరి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. వీటి నష్టాన్ని అంచనా వేసి నివేదించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. త్వరలో అధికారులు బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయన్నారు. సమావేశంలో విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, గన్ని వీరాంజనేయులు, మెంటే పార్ధసారథి, భీమవరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.