నారాయణ లాస్ట్.. పీతల ఫస్ట్
విజయవాడ: పనితీరును, అభివృద్ధి పనులపై అందించిన సమాచారాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కీలకమైన రాజధాని భూసేకరణ, నిర్మాణ ఒప్పందాలు తదితర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణకు సీఎం చిట్టచివరి ర్యాంకు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కింది. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం ఆయా మంత్రులకు ఏయే ర్యాంకులు లభించాయో వెల్లడించినట్లు తెలిసింది. ఇతర మంత్రుల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి..
దేవినేని ఉమ- 2, పత్తిపాటి పుల్లారావు- 3, కామినేని శ్రీనివాసరావు- 4, పరిటాల సునీత- 5, రావెల కిశోర్ బాబు- 6, అచ్చెన్నాయుడు- 7, గంటా శ్రీనివాసరావు- 8, కొల్లు రవీంద్ర- 9, అయ్యన్నపాత్రుడు- 10, పల్లె రఘునాథరెడ్డి- 11, మృణాళిని 13, పి. నారాయణ- 18వ ర్యాంకు పొందారు. గత ఆగస్టులోనూ ప్రభుత్వ పథకాల అమలు ప్రామాణికంగా టీడీపీ అధినేత మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాటి ర్యాంకుల్లో సీఎం చంద్రబాబుకు అనూహ్యంగా రాష్ట్రంలో 9వ ర్యాంక్ దక్కింది.