పుష్కరఘాట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌తో కలసి బోటు ద్వారా పట్టణంలోని పుష్కర ఘాట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 11 రోజులుగా కోటీ 33 లక్షల మంది భక్తులు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. గురువారం వరకు జిల్లాలో కోటీ 20 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించగా శుక్రవారం మరో 13 లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టు ఆచరించినట్టు మంత్రి తెలిపారు.
పుష్కరజ్యోతిని విజయవంతం చేయాలి
పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగే పుష్కరజ్యోతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించి విజయవంతం చేయాలని మంత్రి పీతల సుజాత కోరారు. శుక్రవారం ఆమె కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కర ఏర్పాట్లపై భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పుష్కరజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటింటా దీపారాధన చేపట్టాలన్నారు. పుష్కరాలు విజయవంతంగా జరగడానికి ప్రజలు, అధికారులు, పాత్రికేయులు పూర్తి సహకారం అందించినట్టు మంత్రి సుజాత తెలిపారు. పుష్కరాల ఆఖరిరోజైన శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరస్నానానికి వస్తారని, వారి కోసం ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. పుష్కరాల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని సుజాత తెలిపారు.
అంచనాలను మించి భక్తుల రాక
Published Sat, Jul 25 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement