
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. గురువారం చింతలపూడి రోడ్లు,
చింతలపూడి : రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. గురువారం చింతలపూడి రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద జన్మభూమి-మాఊరు సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని సుజాత తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జన్మభూమి సభల్లో పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు స్వఛ్ఛాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. చింతలపూడిలో బస్‌డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు సుజాత తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత మంత్రిని, ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు. సభలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు జరిపారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్, ఎంపీడీవో వై.పరదేశికుమార్, తహసిల్దార్ టి.మైఖేల్‌రాజ్, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి తదితరులు పాల్గొన్నారు.