
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
హైదరాబాద్: ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ మారనట్లుగా కనిపిస్తోంది. బాక్సైట్ అంశంపై ఏపీ శాసనసభలో మంత్రి పీతల సుజాత ప్రకటన ఇచ్చినప్పటికీ, జీవో నంబర్ 97ను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనర్థం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదంటూ విశాఖ జిల్లాలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉండగా జీవో నంబర్97 అనేది విశాఖ, మన్యం ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. గత కొన్ని రోజులుగా వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గిరిజనులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారు, కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడం గమనార్హం.