'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వద్దన్నాడు'
గుంటూరు వెస్ట్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శీతాకాల సమావేశాలలో ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చించక పోవడం దారుణమన్నారు. పార్లమెంట్, శాసనసభలలో ప్రజా సమస్యలపై చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అనవసరమైన అంశాలపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాపై ఏడాదిపాటు బహిష్కరణ వేటువేయడం తగదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటికి అనుమతులు మంజూరు చేయడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చక్రం వెనుకకు తిరుగుతున్నదని నారాయణ వ్యాఖ్యానించారు.