కేసులు పెట్టగానే.. బాబుకు సెక్షన్-8 గుర్తొచ్చిందా?
హైదరాబాద్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు తన బాధను ప్రపంచం బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ విమర్శించారు. రాజకీయాల్లో కొనుగోళ్లు అనేది చంద్రబాబుతోనే మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు తమకు అనుకూలంగా లేరని గవర్నర్‌ను టీడీపీ నాయకులు దుర్భాష లాడుతున్నారన్నారు. బాబుపై కేసుల వ్యవహారం రాగానే ఆర్టికల్-8 గుర్తుకు వచ్చిందని, హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు క్షీణించాయని తాము అనుకోవడం లేదన్నారు. సెక్షన్-8ను ఓటుకు కోట్లు కేసుతో ముడిపెట్టడం.. అత్తమీసాలకు, భర్త మోకాలుకు ముడిపెట్టినట్లుందని ఎద్దేవాచేశారు.
శుక్రవారం మఖ్దూంభవన్‌లో తెలంగాణ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ, తెలంగాణల్లో రాజకీయవైషమ్యాలు ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగేలా చేస్తున్నాయన్నారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. ఎన్నికల సంఘం ఉత్సవవిగ్రహంగా తయారైందని విమర్శించారు. ఫిరాయింపులపై స్పీకర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్పీకర్ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ రెండు రంగాలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నాయన్నారు. బీజేపీ సీనియర్‌నేత అద్వానీ నోట ఎమర్జెన్సీ మాట వచ్చిందంటే, అత్యవసర పరిస్థితిని పెట్టి అయినా భూసేకరణ బిల్లుపై ఆమోదముద్ర వేయించుకుంటామన్నట్లుగా ఉందన్నారు.