తిరుపతి: రాజకీయ రంగానికే మచ్చ తెచ్చేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ పరిధిలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను టోకుగా కొనుగోలు చేస్తూ, రాజకీయ విలువలకు పాతర వేస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలను స్వార్థ ప్రయోజనాల కోసం కొనుగోలు చేయడం లేదని ఇద్దరు సీఎంలు నిరూపించగలరా? అని నారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేకుండా చేయొచ్చేమో గానీ.. ప్రజల మనసుల నుంచి మాత్రం ప్రతిపక్షాలను తీసేయలేరని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహానాడులో చేసిన ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు అంశాల తీర్మానాలను అమలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలకులు ఏదో సాధించేసినట్లు రెండేళ్ల సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు.
'రాజకీయాలకు మచ్చ తెచ్చేలా చంద్రబాబు, కేసీఆర్ తీరు'
Published Sun, Jun 5 2016 8:31 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement