పెనుగొండ, న్యూస్‌లైన్ : పెనుమంట్ర మండలం వెలగలేరులో ఇటీవల ఇద్దరు మహిళల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ నకిలీదని నిర్ధారణ అయింది. వెలగలేరుకు చెందిన కర్రి సుజాత రూ. 3 లక్షలు, పెనుగొండకు చెందిన మేడపాటి వెంకటలక్ష్మి రూ.5లక్షల నకిలీ నోట్లతో దొరికారు. అయితే అవి అసలు నోట్లకు తీసిపోని విధంగా ఉండటంతో వాటిని పోలీసులు పరీక్షల నిమిత్తం పంపగా అవి నకిలీవని తేలింది. పెనుగొండ సీఐ వానసల్లి సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం. యానాంకు చెందిన కోనాల సత్యనారాయణ రెడ్డి గతంలో జీడిపిక్కల వ్యాపారం చేశాడు. వ్యాపార భ్వాగస్వాములుగా కర్రి సుజాత, మేడపాటి వెంకటలక్ష్మి చేరారు. వీరిద్దరు పెట్టుబడిగా కొంత మొత్తం అతనికి ఇచ్చారు. సత్యనారాయణరెడ్డి దొంగనోట్ల కేసులో పట్టుబడి ప్రస్తుతం కోల్‌కతా జైలులో ఉన్నాడు.
జైలు నుంచి వీరికి ఫోన్ చేసి మీకు అప్పులు పెరిగి పోతున్నాయని తెలిసి మధ్యవర్తుల ద్వారా రూ.8లక్షలు పంపుతున్నానని, వాటితో అప్పులు తీర్చుకోమని చెప్పాడు. ఆ మహిళలు ఆ డబ్బు తీసుకున్నారు. అయితే అవి దొంగ నోట్లు. నిందితులు ఇద్దరిలో మేడపాటి వెంకటలక్ష్మి 2007లో ఆచంటలో దొంగనోట్లు మార్చుతూ పోలీసులకు చిక్కింది. ఆ కేసు కోర్టులో ఉంది. నకిలీ నోట్లు తీసుకువచ్చిన మధ్యవర్తులను పట్టుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇద్దరు మహిళలను అరెస్ట్‌చేసి తణుకు కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సీహెచ్ వెంకటేశ్వరరావు, డి.ఆదినారాయణ, హెడ్ కానిస్టేబుల్స్ విజయలక్ష్మి, విక్టర్, కానిస్టేబుల్స్ సుధారాణి, జానకిరామ్, శ్రీను, ఏడుకొండలు, బాబ్జీ కృషి చేశారని సీఐ తెలిపారు.
నోట్లను జాగ్రత్తగా పరిశీలించండి
నకిలీనోట్లు సామాన్యులు గుర్తించిలేని విధంగా ఉన్నాయని సీఐ చెప్పారు. అసలు నోట్లపై ఉండే అన్ని గుర్తులూ ఈ నోట్లపై ఉన్నాయని వివరించారు. కాగితం మందంగాను, నోటు మధ్యలో ఉండే దారంవద్ద ఉబ్బెత్తుగా ఉండడంతో అవి నకిలీ నోట్లని నిర్ధారించినట్లు తెలిపారు. రూ.500, రూ.1000 నోట్లు వచ్చినపుడు వ్యాపారులు అతిజాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు.
8లక్షలూ నకిలీ కరెన్సీయే
Published Thu, Sep 26 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement