సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి | Senior journalist basavayya died | Sakshi
Sakshi News home page

సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి

Published Wed, Jun 4 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి

సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి

 పెనుగొండ/పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : సీనియర్ జర్నలిస్ట్, ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన ఇవటూరి వెంకట బసవయ్య(57) మంగళవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం సుస్తీ చేయటంతో తణుకు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున మృతి చెందారు. 1988లో ఉదయం దినపత్రికతో విలేకరిగా జీవితం ప్రారంభించిన బసవయ్య అనంతరం ఆంధ్రప్రభలో పని చేశారు. ప్రస్తుతం వార్త విలేకరిగా ఉన్నారు.
 
 బసవయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. పేద కుటుంబం కావడంతో కుమారుడు జీవనోపాధి నిమిత్తం గతేడాది గల్ఫ్ దేశం వెళ్లాడు. మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన బసవయ్య మరణవార్తకు అధికారులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలేటిపాడులోని ఇంటివద్ద ఉంచిన ఆయన మృతదేహాన్ని ఇరగవరం, పెనుగొండ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పెనుగొండ జెడ్పీటీసీ రొంగల రవికుమార్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు యాదాల ఆశాజ్యోతి, బిరుదగంటి రత్నరాజు, కడలి మంగాదేవి, కేతా భీముడు, పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతా సత్యనారాయణ(సత్తిబాబు) తదితరులు  ఉన్నారు.
 
 ఆచంట ప్రెస్ క్లబ్
 రూ.10వేల ఆర్థిక సాయం
  ఆచంట నియోజకవర్గ ప్రెస్‌క్లబ్ సభ్యులు బసవయ్య కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు జవ్వాది మోహన వెంకటేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి గుర్రాల శ్రీనివాసరావు, సభ్యులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
 
 ఉన్నతాధికారుల సంతాపం
 ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్) : సీనియర్ జర్నలిస్ట్ ఐవీ బసవయ్య ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.భాస్కర నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్‌ఎన్ రాజు, కొవ్వూరు డివిజనల్ పౌరసంబందాధికారి కె. రామ్మోహనరావు, ఏలూరు డివిజనల్ పౌరసంబందాధికారి ఆర్‌వీఎస్ రామచంద్రారావు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement