నష్టపోయిన రైతులను ఆదుకోండి
Published Sun, Nov 17 2013 2:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
పెనుగొండ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను, అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. శనివారం ఉదయం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సహకార సంఘాలు దీర్ఘకాలిక రుణాలపై అందించిన ట్రాక్టర్లను, ద్విచక్రవాహానాలను రైతులకు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనను కలిసి తమ కష్టాలను మొరపెట్టుకున్నారు.
ప్రకృతి విలయాల కారణంగా ఏటా నష్టపోతున్నామని తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాన్ కారణంగా వరి చేలు నేలనంటాయని, ఈనిక సమయంలో వర్షాలు కురిసినందున వెన్నులోని గింజలు పొల్లుగా మారాయని ములపర్రు సొసైటీ అధ్యక్షుడు టీవీసీహెచ్ నాగేశ్వరరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సహకార సంఘాల్లో రుణాలు పొందిన రైతులకు రెండేళ్లుగా పావలా వడ్డీ రాయితీ రావాల్సి ఉందని, ఈ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఇలపర్రు సొసైటీ అధ్యక్షుడు చేకూరి సుబ్బరాజు కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటున్న రైతులకు ఈసీలు మీ సేవ ద్వారా తీసుకోవడం వల్ల అదనపు ఆర్థిక భారమవుతోందని విన్నవించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని, ఉచిత విద్యుత్, ఇతర రాయితీలు అందిస్తన్నామన్నారు. ఈ సందర్భంగా రూ. 6.30 లక్షల విలువైన 16 ట్రాక్టర్లను, 16 ద్విచక్రవాహనాలను అందజేశారు. అనంతరం సీఎం కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, ఈలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ
ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతులు అందజేశారు. అనేక గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్న మార్టేరును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన వెలగల నాగేశ్వరరెడ్డి, నల్లిమిల్లి వివేకానందరెడ్డి, తేతలి రాజారెడ్డి, కర్రి జగధీశ్వరరెడ్డి విన్నవించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి మోషేమాదిగ, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాపాక ప్రభాకర్ మాదిగ సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జిల్లా అధికారులను ప్రశంసించిన సీఎం
ఏలూరు : జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కష్టపడ్డారని కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ టి. బాబూరావునాయుడు, ఎస్పీ హరికృష్ణలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశంసించారు. కృష్ణా జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం పెనుగొండ ఏఎంసీ గ్రౌండ్స్‌లో హెలికాప్టర్‌లో బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారులను ప్రశంసించారు. జేసీ బాబూరావునాయుడిని ప్రత్యేకం ము ఖ్యమంత్రి పిలిచి కరచాలనం చేసి ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి మరింత కష్టపడాలని సూచించారు.
Advertisement
Advertisement