కామన్వెల్త్ గేమ్స్ పతకాలతో లక్ష్య సేన్, శ్రీకాంత్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్‌కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం.
ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్‌కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్‌లో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు.
తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్‌లో మొమోటా లేదా ప్రణయ్‌లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్‌లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో రౌండ్‌లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్‌ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్‌కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment