మర్రిలంకలో గోదావరిలో కలసిపోయిన ఇంటి గోడ
సాక్షి, యలమంచిలి (పశ్చిమ గోదావరి): చుట్టూ గోదావరి.. మధ్యలో మర్రిలంక. అక్కడ విద్యుత్ లేదు. రోడ్లు లేవు. అక్కడకు వెళ్లాలన్నా, రావాలన్నా పడవ ప్రయాణమే ఆధారం. అయినా అక్కడ సుమారు 50 గడపల్లో 60కి పైగా కుటుంబాలు దశాబ్దాలపాటు నివసించాయి. ఈ ద్వీపం ఇప్పుడు కాల గర్భంలో కలసిపోయింది. ఇళ్లన్నీ గోదావరిలో కలసిపోవడంతో ఆ కుటుంబాలన్నీ కనకాయలంక తరలివచ్చాయి. కనకాయలంకలో స్థిరపడిన వారిలో యువకులు చాలామంది ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలివెళ్లినా మర్రిలంకలో పుట్టిన వృద్ధులు మాత్రం ఇప్పటికీ మర్రిలంకపై అభిమానాన్ని చంపుకోలేక నిత్యం అక్కడికి వెళ్లి గడుపుతున్నారు. అటువంటి వారిలో చిల్లే నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
మర్రిలంకలోని ఇళ్లన్నీ కోతకు గురవడంతో అక్కడి నుంచి కనకాయలంక వచ్చిన నారాయణమూర్తి ఇప్పటికీ ప్రతి రోజు పడవపై మర్రిలంక వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పశువులను మేపుకుని ఇంటికి వస్తాడు. అలా ఎందుకని నారాయణమూర్తిని ప్రశ్నిస్తే అక్కడే పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కూడా అక్కడే కలిగారు. మర్రిలంకతో నా బంధం విడిపోనిది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ లంకలో తాగిన నీళ్లు, జొన్న అన్నం, రాగి తోపు చలవే. అయితే మర్రిలంక నుంచి అందరూ వచ్చేయడంతో కనకాయలంకలో ఇల్లు కట్టుకున్నాను. కాని ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రోజూ ఉదయమే చద్దన్నం తిని పడవపై మర్రిలంక వెళ్తాను.
మధ్యాహ్నం భోజనం పడవపై వస్తుంది. సాయంత్రం వరకూ అక్కడే పశువులు మేపుకుని వస్తానన్నాడు. మరో వృద్ధుడు చిల్లే చినరామన్నను పలకరిస్తే తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చాం కాని మా మనసంతా మర్రిలంకలో ఉంటుందన్నారు. అక్కడ 70 ఏళ్లు ఉన్నానని, ఎప్పుడు చిన్న రోగం కూడా రాలేదన్నారు. అక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, కల్తీలేని ఆహారమే అందుకు కారణమని చెప్పాడు. చిన్నతనంలో కూలి పనికి వెళితే అర్ధ రూపాయి కూలి ఇచ్చేవారు. ఆ డబ్బు హాయిగా బతకడానికి సరిపోయేది. ఇప్పుడు రూ.500 కూలి వస్తున్నా సరిపోవడం లేదని చెప్పాడు.
డిగ్రీ పూర్తి చేసిన ఒకే వ్యక్తి
మర్రిలంకలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి, ఆఖరి వ్యక్తిని నేనే. అక్కడ నుంచి పడవపై దొడ్డిపట్ల వచ్చి 10వ తరగతి చదువుకున్నాను. అనంతరం పాలకొల్లులో ఇంటర్, వీరవాసరంలో హాస్టల్‌లో ఉండి డిగ్రీ చదివాను. మా తాతలు, నాన్నలు మర్రిలంకలో ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వ్యవసాయం ఒక్కటే చేసేవారు. రాజకీయాల గురించి అసలు తెలిసేది కాదు. అయితే ఎన్నికలు వస్తే అందరూ కాంగ్రెస్‌కే ఓటేసేవారు.
– చిల్లే వసంతరావు
కల్మషం తెలియని రోజులవి
నా చిన్నతనమంతా మర్రిలంకలోనే గడచిపోయింది. మర్రిలంకలో ఉన్నన్ని రోజులు కల్మషమంటే తెలియదు. అందరికీ కలిపి సొంత పడవ ఉండేది. శుక్రవారం వచ్చిందంటే ఆ పడవపై దొడ్డిపట్ల వెళ్లి సంత చేసుకు వచ్చేవారు. సంతలో తెచ్చే మిఠాయిలు కోసం పిల్లలందరూ ఎదురు చూసేవాళ్లం. అందరిదీ ఒకే మాటగా ఉండేది. వరదలు వచ్చినా అక్కడే ఉండేవాళ్లం. అక్కడ ఎన్నో విషసర్పాలు ఉండేవి. కాని ఒకసారి కూడా ఎవరినీ కాటేసిన దాఖలాలు లేవు.
- చిల్లే శ్యామ్‌సుందర్
Comments
Please login to add a commentAdd a comment