yalamanchali
-
మర్రిలంక.. మరి లేదింక
సాక్షి, యలమంచిలి (పశ్చిమ గోదావరి): చుట్టూ గోదావరి.. మధ్యలో మర్రిలంక. అక్కడ విద్యుత్ లేదు. రోడ్లు లేవు. అక్కడకు వెళ్లాలన్నా, రావాలన్నా పడవ ప్రయాణమే ఆధారం. అయినా అక్కడ సుమారు 50 గడపల్లో 60కి పైగా కుటుంబాలు దశాబ్దాలపాటు నివసించాయి. ఈ ద్వీపం ఇప్పుడు కాల గర్భంలో కలసిపోయింది. ఇళ్లన్నీ గోదావరిలో కలసిపోవడంతో ఆ కుటుంబాలన్నీ కనకాయలంక తరలివచ్చాయి. కనకాయలంకలో స్థిరపడిన వారిలో యువకులు చాలామంది ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు తరలివెళ్లినా మర్రిలంకలో పుట్టిన వృద్ధులు మాత్రం ఇప్పటికీ మర్రిలంకపై అభిమానాన్ని చంపుకోలేక నిత్యం అక్కడికి వెళ్లి గడుపుతున్నారు. అటువంటి వారిలో చిల్లే నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మర్రిలంకలోని ఇళ్లన్నీ కోతకు గురవడంతో అక్కడి నుంచి కనకాయలంక వచ్చిన నారాయణమూర్తి ఇప్పటికీ ప్రతి రోజు పడవపై మర్రిలంక వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పశువులను మేపుకుని ఇంటికి వస్తాడు. అలా ఎందుకని నారాయణమూర్తిని ప్రశ్నిస్తే అక్కడే పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కూడా అక్కడే కలిగారు. మర్రిలంకతో నా బంధం విడిపోనిది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఆ లంకలో తాగిన నీళ్లు, జొన్న అన్నం, రాగి తోపు చలవే. అయితే మర్రిలంక నుంచి అందరూ వచ్చేయడంతో కనకాయలంకలో ఇల్లు కట్టుకున్నాను. కాని ఇక్కడ ఉండడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రోజూ ఉదయమే చద్దన్నం తిని పడవపై మర్రిలంక వెళ్తాను. మధ్యాహ్నం భోజనం పడవపై వస్తుంది. సాయంత్రం వరకూ అక్కడే పశువులు మేపుకుని వస్తానన్నాడు. మరో వృద్ధుడు చిల్లే చినరామన్నను పలకరిస్తే తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చాం కాని మా మనసంతా మర్రిలంకలో ఉంటుందన్నారు. అక్కడ 70 ఏళ్లు ఉన్నానని, ఎప్పుడు చిన్న రోగం కూడా రాలేదన్నారు. అక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, కల్తీలేని ఆహారమే అందుకు కారణమని చెప్పాడు. చిన్నతనంలో కూలి పనికి వెళితే అర్ధ రూపాయి కూలి ఇచ్చేవారు. ఆ డబ్బు హాయిగా బతకడానికి సరిపోయేది. ఇప్పుడు రూ.500 కూలి వస్తున్నా సరిపోవడం లేదని చెప్పాడు. డిగ్రీ పూర్తి చేసిన ఒకే వ్యక్తి మర్రిలంకలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి, ఆఖరి వ్యక్తిని నేనే. అక్కడ నుంచి పడవపై దొడ్డిపట్ల వచ్చి 10వ తరగతి చదువుకున్నాను. అనంతరం పాలకొల్లులో ఇంటర్, వీరవాసరంలో హాస్టల్లో ఉండి డిగ్రీ చదివాను. మా తాతలు, నాన్నలు మర్రిలంకలో ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వ్యవసాయం ఒక్కటే చేసేవారు. రాజకీయాల గురించి అసలు తెలిసేది కాదు. అయితే ఎన్నికలు వస్తే అందరూ కాంగ్రెస్‌కే ఓటేసేవారు. – చిల్లే వసంతరావు కల్మషం తెలియని రోజులవి నా చిన్నతనమంతా మర్రిలంకలోనే గడచిపోయింది. మర్రిలంకలో ఉన్నన్ని రోజులు కల్మషమంటే తెలియదు. అందరికీ కలిపి సొంత పడవ ఉండేది. శుక్రవారం వచ్చిందంటే ఆ పడవపై దొడ్డిపట్ల వెళ్లి సంత చేసుకు వచ్చేవారు. సంతలో తెచ్చే మిఠాయిలు కోసం పిల్లలందరూ ఎదురు చూసేవాళ్లం. అందరిదీ ఒకే మాటగా ఉండేది. వరదలు వచ్చినా అక్కడే ఉండేవాళ్లం. అక్కడ ఎన్నో విషసర్పాలు ఉండేవి. కాని ఒకసారి కూడా ఎవరినీ కాటేసిన దాఖలాలు లేవు. - చిల్లే శ్యామ్‌సుందర్ -
మహిత హత్య : పోలీసుల అదుపులో నిందితుడు
సాక్షి, పశ్చిమగోదావరి : యలమంచిలి మండలం కాజ గ్రామంలో సంచలనం సృష్టించిన పెనుమాల మహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు కూరెళ్ల మహేష్‌ను పాలకొల్లు రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ. ‘పథకం ప్రకారమే మహేష్ ఈ హత్య చేశాడు. ఈ ఘటనలో మహేష్‌కు అతని స్నేహితులు కూడా సహకరించారు. ప్రస్తుతం అతని స్నేహితులు ఇంతియాజ్, కోటేశ్వరావుల కోసం గాలిస్తున్నాం. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామ’ని తెలిపారు. నిందుతుడు మహేష్ సినిమా షూటింగ్‌లకు క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో షూటింగ్ చూడటానికి వచ్చిన మహితతో అతనికి పరిచయం ఏర్పడింది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి అవ్వడమే కాక వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాలకొల్లు వచ్చి మహితకు ఫోన్ చేసి.. కలవాలని చెప్పాడు. దాంతో మహిత ఇంటి నుంచి బయటకు వచ్చి మహేష్‌ను కలిసింది. తనను మర్చిపోవాలని కోరింది. మహిత తనను నిరాకరించడంతో మహేష్ తన వెంట తెచ్చుకున్న మాంసం కత్తితో అతి కిరాతకంగా మహిత మీద దాడి చేసి చంపాడు. -
మహిత హత్య.. వెలుగులోకి వాస్తవాలు!
సాక్షి, యలమంచలి: ప్రేమ వ్యవహారం.. మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ యువకుడు కత్తితో చేసిన అమానుష దాడిలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోయిన ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపుతోంది. నక్కింటి చెరువువారికి చెందిన 19 ఏళ్ల యువతి పెనుమాల మహిత ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజకు వచ్చింది. ఆమెతోపాటు ఉన్న కురేళ్ల మహేష్, అతని స్నేహితులు దాడికి దిగారు. కత్తిలో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిత అక్కడిక్కడే చనిపోగా.. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు పారిపోయారు. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న మహేష్ మాత్రం స్థానికులకు దొరికిపోయాడు. జనం తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన మహేష్‌ను పోలీసులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..! ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కురెళ్ల మహేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. నిందితుడు కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని దాకారం గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రొడక్షన్ యూనిట్లో పనిచేసేవాడు. పెనుమాల మహిత కాకినాడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదివింది. ఇంటర్లో ఫెయిల్ కావడంతో రాజోలు ఆదిత్య కాలేజీలో ఇంటర్ మళ్లీ చదువుతోంది. ఆమె స్వగ్రామం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తండ్రి భీమవరం ఆదిత్య కాలేజీ బస్సు డ్రైవర్. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ నిమిత్తం మూడు నెలల క్రితం పాలకొల్లు వచ్చినప్పుడు తొలిసారిగా మహిత మహేష్‌కు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి అయి.. విడాకుల వరకు వ్యవహారం వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది. పక్కా పథకంతోనే హత్య.. ఈ క్రమంలో తన ప్రేమను అంగీకరించకపోతే.. మహితను చంపేయాలని మహేశ్ ముందస్తుగానే పక్కా ప్రణాళికను రచించినట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే మాంసం నరికే కత్తిని తన బ్యాగులో పెట్టుకొని.. హైదరాబాద్ నుంచి మరో ఇద్దరి స్నేహితులతో కలిసి యలమంచిలి మండలం కాజ గొప్పు గ్రామంలోని మహిత ఉంటున్న మేనమామ ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం మాట్లాడాలని మేనమామ ఇంటి నుంచి మహితను అతను బయటకి పిలిపించాడు. బయటకి వచ్చిన తర్వాత కిలోమీటర్ దూరం వరకు ఆమెతో మాట్లాడుతూ వెళ్లాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని మహితపై అతను ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు, మహిత నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. మహిత మెడపై, తల వెనుక భాగంలో కత్తివేట్లు పడ్డాయి. మహిత అక్కడికక్కడే చనిపోవడంతో అతని ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. చేతిలో కత్తితో ఉన్న మహేష్‌ను గుర్తించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పరారైనమరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
246వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, యలమంచిలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 246వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జననేత రాంబిల్లి నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం మండలంలోని వెంకటాపురం, గొర్లి ధర్మవరం, వెదురువాడ మీదుగా పాదయాత్ర సాగుతుంది. తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. అచ్యుతాపురం మీదుగా రమణ పాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘తొడగొట్టే సంస్కృతి అవసరం లేదు’
విజయవాడ : రాజకీయాలలో తొడగొట్టే సంస్కృతి అవసరం లేదని, ఎటువంటి అంశాన్ని అయినా సున్నితంగా చెబితే సరిపోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం సిద్ధార్థ అకాడమీలో మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన "తలుచుకుందాం... ప్రేమతో" అనే పుస్తక ఆవిష్కరణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నేటి రాజకీయ వ్యవస్థలో సత్యానికి(నిజానికి) స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ సత్యం-అహింసలే ఆయుధంగా సామాజిక మార్పు తెచ్చారని, యలమంచిలి శివాజీ మాదిరిగా తెలుగులో రాజకీయ నేతలు సమాజానికి స్పూర్తి దాయకమైన రచనలు చేయాలని సూచించారు. ఎక్కువగా ఇంగ్లీషులోనే ఈ తరహా రచనలు వస్తున్నాయన్నారు. యలమంచిలి శివాజీ తన పుస్తకం ద్వారా ప్రముఖులతో తన అనుబంధాలను చక్కగా వ్యక్తీకరించారని అన్నారు. తనను ప్రభావితం చేసిన ప్రముఖుల వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. నేటితరం రాజకీయ నాయకుల్లో రచనా వ్యాసాంగం పట్ల ఆసక్తి లేకుండా పోతోందన్న బాధ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రమీలా రాణి తదితరులు పాల్గొన్నారు. -
యలమంచిలిలో రోడ్డు ప్రమాదం
- యువకుడి మృతి యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఖాజ బైపాస్ రోడ్డులో సోమవారం ప్రమాదం జరిగింది. బైక్‌లపై వెళ్తున్న నలుగురు యువకులు ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్(23) అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్నేహితుడి పెళ్లి నిమిత్తం వీరంతా హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరికి బైక్‌లపై వచ్చారు. పెళ్లి ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. బావాడలోని గోదావరి నది నుంచి ఈ ట్రాక్టర్లు ఇసుకను తీసుకెళుతుండగా వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. మరో వైపు సంక్రాంతి వేడుకల్లో భాగంగా యలమంచిలిలోని హైస్కూల్ ఆవరణలో మంగళవారం ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. సుమారు 150 మంది యువతులు, మహిళలు పాల్గొని ముగ్గులతో పోటీ పడ్డారు.