
India And South Africa A Series Draw: భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడో అనధికారిక టెస్టు కూడా ‘డ్రా’గా ముగిసింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 0–0తో ‘డ్రా’ అయ్యింది. 304 పరుగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్... మ్యాచ్ చివరి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 90 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 3 వికెట్లకు 311 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జుబేర్ హమ్జా (125 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు.
చాలెంజర్ విజేత ఇండియా ‘ఎ’
సాక్షి, విజయవాడ: సీనియర్ మహిళల క్రికెట్ చాలెంజర్ ట్రోఫీని ఇండియా ‘ఎ’ జట్టు గెలుచు కుంది. గురువారం మూలపాడు మైదానంలో జరిగిన ఫైనల్లో ‘ఎ’ 3 వికెట్ల తేడాతో ఇండియా ‘డి’ను ఓడించింది. ముందుగా ‘డి’ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ (74 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు), ఎస్. మేఘన (44 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. డీడీ కసట్‌కు 3 వికెట్లు దక్కాయి.
అనంతరం ‘ఎ’ టీమ్ 45.4 ఓవర్లలో 7 వికెట్లకు 224 పరుగులు చేసి టోర్నీ విజేతగా నిలిచింది. యస్తిక భాటియా (102 బంతుల్లో 86; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చల్లా ఝాన్సీ లక్ష్మీ(70 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీసినా లాభం లేకపోయింది.
చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే..