
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్‌లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు.