రాష్‌ఫోర్డ్
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది.
అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది.
ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది.
వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది.
18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్‌లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్‌ఫోర్డ్‌కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు.
నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు.
అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment