అట్టహాసంగా ప్రారంభోత్సవం
‘మనల్నందరినీ కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే ఘటనలకంటే ఎంతో గొప్పది... అయితే ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఏమేం చేయాలి’... హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్‌లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. చివరగా...ఖతర్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్–థని ‘అరబ్ ప్రపంచం తరఫున అందరికీ ఈ వరల్డ్ కప్‌లో స్వాగతం పలుకుతున్నాం’ అంటూ మెగా టోర్నీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించడంతో కార్యక్రమం ముగిసంది.
92 సంవత్సరాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది.
అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోర్నీకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్‌తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్‌కు మూడు పాయింట్లు లభించాయి.
గత ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలమైన ఈక్వెడార్ తాజా టోర్నీలో మాత్రం ఖతర్‌పై అదరగొట్టే ప్రదర్శన చేసింది. గతంలో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాయి. అయితే ఈసారి మాత్రం ఈక్వెడార్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. పూర్తి సమన్వయంతో కదులుతూ ఖతర్ గోల్‌పోస్ట్‌పై తొలి నిమిషం నుంచే దాడులు చేసింది. ఆట మూడో నిమిషంలోనే ఈక్వెడార్ ఖాతా తెరిచింది. ఫెలిక్స్ టోరెస్ ఆక్రోబాటిక్ కిక్ షాట్ గాల్లోకి లేవగా వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఈక్వెడార్ జట్టు సంబరంలో మునిగింది. అయితే ఖతర్ జట్టు గోల్‌పై సమీక్ష కోరింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీవీ రీప్లేను పరిశీలించగా ‘ఆఫ్ సైడ్’ అని తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. అయితే ఈక్వెడార్ పట్టువదలకుండా తమ దాడులకు పదును పెట్టింది.
ఫలితంగా ఖతర్ జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించడమే తప్ప ఎదురు దాడులు చేయలేకపోయింది. 16వ నిమిషంలో బంతితో ‘డి’ ఏరియాలోకి వచ్చిన ఈక్వెడార్ ప్లేయర్ వాలెన్సియాను ఖతర్ గోల్ కీపర్ సాద్ అల్ షీబ్ మొరటుగా అడ్డుకోవడంతో వాలెన్సియా పడిపోయాడు. ఫలితంగా రిఫరీ ఈక్వెడార్‌కు పెనాల్టీ కిక్ ప్రకటించగా... వాలెన్సియా ఈ పెనాల్టీని గోల్‌గా మలిచి ఈక్వెడార్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో సహచరుడు ఏంజెలో ప్రెసియాడో క్రాస్ షాట్‌ను వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి ఈక్వెడార్ 2–0తో ఆధిక్యంలోకి నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ ఈక్వెడార్ జోరు కొనసాగగా...ఖతర్ జట్టుకు ప్రత్యర్థిని నిలువరించడంలోనే సరిపోయింది. ఈక్వెడార్‌కు మూడో గోల్ ఇవ్వకుండా ఖతర్ మ్యాచ్‌ను ముగించగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment