
పల్లెకెలె: కెప్టెన్ దిముత్ కరుణరత్నే (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) డబుల్ సెంచరీకితోడు ధనంజయ డిసిల్వా (154 బ్యాటింగ్; 20 ఫోర్లు) శతకంతో క్రీజులో నిలబడటంతో... బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 229/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 512 పరుగులు చేసింది. వెలుతురులేమితో 76 ఓవర్ల ఆట సాధ్యంకాగా... శ్రీలంక ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. కరుణరత్నే, ధనంజయ నాలుగో వికెట్‌కు అజేయంగా 322 పరుగులు జతచేశారు. నాలుగో రోజు కరుణరత్నే–ధనంజయ ద్వయం 283 పరుగులు జోడించింది. కరుణరత్నే కెరీర్‌లో ఇది తొలి డబుల్ సెంచరీ. టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక తరఫున ఒక రోజంతా ఆడిన ఆరో జోడీగా కరుణరత్నే–ధనంజయ జంట నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 541/7కు శ్రీలంక మరో 29 పరుగుల దూరంలో ఉంది.