
గోల్ కొట్టిన అనంతరం హర్మన్‌ప్రీత్ ఆనందం
బ్రెడా (నెదర్లాండ్స్): చివరి క్షణాల్లో పట్టు సడలించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చే అలవాటు మరోసారి భారత్ కొంపముంచింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు ‘డ్రా’గా ముగించింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో గురువారం ఇక్కడ బెల్జియం, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో సమమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు.
మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో చెలరేగిన భారత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒత్తిడిని కొనసాగిస్తూ... మ్యాచ్‌పై పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకొని భారత ఆటగాళ్లను విసిగించారు. ఈ క్రమంలో భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment