Champions Trophy hockey tournament
-
దీపిక డబుల్ ధమాకా
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో మలేసియాను చిత్తు చేసిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. హోరాహోరీగా సాగిన పోరులో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు స్ట్రయికర్ దీపిక కుమారి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంలో భారత్ ఈ టోరీ్నలో వరసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మన జట్టు తరఫున దీపిక (20వ, 57వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... సంగీత కుమారి (3వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. కొరియా తరఫున యూరీ లీ (34వ ని.లో), కెపె్టన్ ఇన్బి చియోన్ (38వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ... దూకుడైన ఆటతో ముందుకు సాగిన భారత్... మూడో నిమిషంలోనే సంగీత కుమారి ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో దీపిక మరో ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 2–0తో సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. అప్పటి వరకు భారత గోల్ పోస్ట్‌పై ఒక్కసారి కూడా దాడి చేయలేకపోయిన కొరియా ప్లేయర్లు... మూడో క్వార్టర్స్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరు సమం చేశారు. ఇక అక్కడి నుంచి ఆధిక్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా ప్రయత్నించగా... చివరకు దీపిక గోల్‌తో భారత్ విజయపతాక ఎగరేసింది. మరోవైపు థాయ్‌లాండ్, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కాగా... చైనా 5–0తో మలేసియాపై విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం థాయ్‌లాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. -
టైటిల్ పోరుకు టీమిండియా
బ్రెడా (నెదర్లాండ్స్): చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం ఆతిథ్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’ అయింది. ఫైనల్ చేరేందుకు కనీసం ‘డ్రా’ చేసుకుంటే సరిపోయే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేందుకు చోమటోడ్చింది. చివరకు ‘డ్రా’ ఫలితంతో తుదిపోరుకు అర్హత సంపాదించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మన్దీప్ సింగ్ (47వ నిమిషంలో) గోల్ చేయగా, తియెరి బ్రింక్‌మన్ (55వ ని.) నెదర్లాండ్స్‌కు గోల్ అందించాడు. తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ హర్మన్‌ప్రీత్, సునీల్ వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ ఆకట్టుకున్నాడు. రెండో క్వార్టర్లో ప్రత్యర్థి జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను అతను సమర్థంగా అడ్డుకున్నాడు. ఇందులో ఏ ఒక్కటి గోల్ అయినా భారత్ పరిస్థితి క్లిష్టంగా ఉండేది. ఆరు దేశాలు తలపడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, భారత్ రెండో స్థానంలో ఉంది. టోర్నీ నిబంధనల ప్రకారం టాప్–2 జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–3తో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. రాత్రి గం. 7.30కు మొదలయ్యే ఈ ఫైనల్‌ను స్టార్ స్పోర్ట్స్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
భారత్ 1–1 బెల్జియం
బ్రెడా (నెదర్లాండ్స్): చివరి క్షణాల్లో పట్టు సడలించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చే అలవాటు మరోసారి భారత్ కొంపముంచింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన భారత హాకీ జట్టు చివరి రెండు నిమిషాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను చివరకు ‘డ్రా’గా ముగించింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో గురువారం ఇక్కడ బెల్జియం, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో సమమైంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (10వ నిమిషంలో), బెల్జియం తరఫున లొయిక్ ల్యూపార్ట్ (59వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడైన ఆటతో చెలరేగిన భారత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒత్తిడిని కొనసాగిస్తూ... మ్యాచ్‌పై పైచేయి కనబర్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో దాడులు తీవ్రతరం చేసిన బెల్జియం ఆటగాళ్లు బంతిని ఎక్కువ శాతం తమ నియంత్రణలో ఉంచుకొని భారత ఆటగాళ్లను విసిగించారు. ఈ క్రమంలో భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... బెల్జియం ఆటగాళ్లకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను లొయిక్ లూపార్ట్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. -
ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన భారత్
బ్రెడా (నెదర్లాండ్స్): చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జోరుకు బ్రేక్ పడింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3 గోల్స్ తేడాతో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. అయితే ఆసీస్ పైచేయి సాధించడంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి తప్పలేదు. టీమిండియా తరఫున వరుణ్ కుమార్ (10వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (58వ ని.) చెరో గోల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టులో లచ్లాన్ షార్ప్ (6వ ని.), టామ్ క్రెయిగ్ (15వ ని.), ట్రెంట్ మిటన్ (33వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు జరిగే పోరులో బెల్జియంతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
భారత్ ఆశలు సజీవం
* కొరియాపై 2-1తో విజయం * చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: గత మూడు దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ పతకాన్ని ఈసారైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత్ తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో గెలుపు. తాజా విజయంతో భారత్ పాయింట్ట పట్టికలో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ తరఫున కెప్టెన్ సునీల్ 39వ నిమిషంలో... నికిన్ చందన తిమ్మయ్య 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు 57వ నిమిషంలో కిమ్ జుహున్ ఏకైక గోల్‌ను అందించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చాయి. తుదకు 39వ నిమిషంలో భారత్ సఫలమైంది. ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను డి ఏరియాలో ఉన్న సునీల్ లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత 57వ నిమిషంలో కొరియా స్కోరును సమం చేసింది. అయితే కొరియాకు ఆ ఆనందం నిమిషం కూడా నిలువలేదు. కొరియా స్కోరును సమం చేసిన వెంటనే భారత్ రెండో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మిగతా మూడు నిమిషాలు ప్రత్యర్థికి మరో గోల్ చేయనీకుండా అడ్డుకొని భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
నెదర్లాండ్స్‌పై భారత్ సంచలన విజయం 18 ఏళ్ల తర్వాత తొలి గెలుపు రేపు క్వార్టర్స్‌లో బెల్జియంతో ‘ఢీ’ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ భువనేశ్వర్: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కసినంతా నెదర్లాండ్స్‌పై తీర్చుకున్న భారత జట్టు సంచలనం సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2 గోల్స్ తేడాతో అద్వితీయ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 18 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి నెగ్గింది. భారత్ తరఫున సునీల్ (33వ నిమిషంలో), మన్‌ప్రీత్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు వాన్ డెర్ వీర్డెన్ మింక్ (36వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు.మన్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. చివరిసారి 1996లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ జట్టుపై 1986 తర్వాత తొలిసారి గెలిచింది. నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో మూడు పాయింట్లతో జర్మనీతో సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో భారత్‌కు మూడో స్థానం (-2 గోల్స్) దక్కగా... జర్మనీ (-5 గోల్స్) నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 3-0తో జర్మనీపై; ఆస్ట్రేలియా 3-0తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... ఇంగ్లండ్, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 1-1 వద్ద ‘డ్రా’గా ముగిసింది.