ఎన్నాళ్లకెన్నాళ్లకు...
నెదర్లాండ్స్‌పై భారత్ సంచలన విజయం
18 ఏళ్ల తర్వాత తొలి గెలుపు
రేపు క్వార్టర్స్‌లో బెల్జియంతో ‘ఢీ’
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
భువనేశ్వర్: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కసినంతా నెదర్లాండ్స్‌పై తీర్చుకున్న భారత జట్టు సంచలనం సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రపంచ రెండో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3-2 గోల్స్ తేడాతో అద్వితీయ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 18 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి నెగ్గింది. భారత్ తరఫున సునీల్ (33వ నిమిషంలో), మన్‌ప్రీత్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ సింగ్ (49వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు వాన్ డెర్ వీర్‌డెన్ మింక్ (36వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు.మన్‌ప్రీత్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
చివరిసారి 1996లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆ జట్టుపై 1986 తర్వాత తొలిసారి గెలిచింది. నెదర్లాండ్స్‌పై విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో మూడు పాయింట్లతో జర్మనీతో సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఈ గ్రూప్‌లో భారత్‌కు మూడో స్థానం (-2 గోల్స్) దక్కగా... జర్మనీ (-5 గోల్స్) నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 3-0తో జర్మనీపై; ఆస్ట్రేలియా 3-0తో పాకిస్తాన్‌పై గెలుపొందగా... ఇంగ్లండ్, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ 1-1 వద్ద ‘డ్రా’గా ముగిసింది.