దక్షిణ కొరియాపై భారత్ విజయం
ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో మలేసియాను చిత్తు చేసిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. హోరాహోరీగా సాగిన పోరులో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలుపొందింది.
మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు స్ట్రయికర్ దీపిక కుమారి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంలో భారత్ ఈ టోరీ్నలో వరసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మన జట్టు తరఫున దీపిక (20వ, 57వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... సంగీత కుమారి (3వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. కొరియా తరఫున యూరీ లీ (34వ ని.లో), కెపె్టన్ ఇన్బి చియోన్ (38వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ... దూకుడైన ఆటతో ముందుకు సాగిన భారత్... మూడో నిమిషంలోనే సంగీత కుమారి ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో దీపిక మరో ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 2–0తో సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. అప్పటి వరకు భారత గోల్ పోస్ట్‌పై ఒక్కసారి కూడా దాడి చేయలేకపోయిన కొరియా ప్లేయర్లు... మూడో క్వార్టర్స్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరు సమం చేశారు.
ఇక అక్కడి నుంచి ఆధిక్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా ప్రయత్నించగా... చివరకు దీపిక గోల్‌తో భారత్ విజయపతాక ఎగరేసింది. మరోవైపు థాయ్‌లాండ్, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కాగా... చైనా 5–0తో మలేసియాపై విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం థాయ్‌లాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment