నేడు దక్షిణ కొరియాతో భారత హాకీ జట్టు సెమీఫైనల్ పోరు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ
మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్ టెన్–1 చానెల్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాకౌట్ దశలోనూ తమ జోరు కొనసాగించాలనే లక్ష్యంతో నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో టీమిండియా తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు లీగ్ దశలో 21 గోల్స్ సాధించి కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది.
ఆతిథ్య చైనా జట్టుపై 3–0తో గెలిచి ఈ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు ఆ తర్వాత జపాన్‌పై 5–1తో, మలేసియాపై 8–1తో గెలిచింది. అనంతరం దక్షిణ కొరియాపై 3–1తో, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 2–1తో విజయం సాధించిన భారత జట్టు ఈ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. ఫార్వర్డ్ శ్రేణిలో, మిడ్ ఫీల్డ్‌లో, డిఫెన్స్‌లో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన స్ట్రయికర్లు ఈ టోర్నీలో మాత్రం మెరిశారు. సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్, అరిజిత్ సింగ్ అంచనాలకు మించి రాణించారు.
యువ మిడ్ ఫీల్డర్ రాజ్‌కుమార్ పాల్ మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’ సాధించాడు. మాజీ కెపె్టన్ మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెపె్టన్ వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ మిడ్ ఫీల్డ్‌లో చురుకుగా కదులుతూ ఫార్వర్డ్ శ్రేణి ఆటగాళ్లకు పాస్‌లు అందించారు. దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నీలో గోల్ కీపర్లు కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ అడ్డుగోడలా నిలబడ్డారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్ షాట్‌లతో ఆకట్టుకొని ఐదు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాడు.
అయితే లీగ్ దశలో కొరియాను అలవోకగా ఓడించిన భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లో కొరియాను తేలిగ్గా తీసుకోకుండా పక్కా వ్యూహంతో ఆడాల్సిన అవసరం ఉంది. కొరియా జట్టుకు ఎక్కువ పెనాల్టీ కార్నర్‌లు రాకుండా జాగ్రత్త పడాలి. కొరియా డ్రాగ్ ఫ్లికర్ జిహున్ యాంగ్ ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. యాంగ్‌ను నిలువరిస్తే కొరియా జోరుకు అడ్డుకట్ట వేసినట్టే.
‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత తక్కువ సమయం విశ్రాంతి తీసుకొని చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు వచ్చాం. భారత జట్టు ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. కొరియా క్లిష్టమైన ప్రత్యర్థి. డిఫెన్స్‌తోపాటు అటాకింగ్‌లో కొరియాకు మంచి పేరుంది’ అని హర్మన్ వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో చైనాతో పాకిస్తాన్ ఆడుతుంది.
38 భారత్, దక్షిణ కొరియా జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 61 సార్లు తలపడ్డాయి. 38 సార్లు భారత్ గెలుపొందగా... 11 సార్లు కొరియాను విజయం వరించింది. 12 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
7 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరిగింది. భారత జట్టు ఏడు సార్లు సెమీఫైనల్ దశకు చేరుకుంది. 2013లో మాత్రం భారత జట్టు లీగ్ దశలోనే ని్రష్కమించింది.
Comments
Please login to add a commentAdd a comment