భారత్ ఆశలు సజీవం
* కొరియాపై 2-1తో విజయం
* చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ
లండన్: గత మూడు దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ పతకాన్ని ఈసారైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న భారత్ తమ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో గెలుపు. తాజా విజయంతో భారత్ పాయింట్ట పట్టికలో ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
భారత్ తరఫున కెప్టెన్ సునీల్ 39వ నిమిషంలో... నికిన్ చందన తిమ్మయ్య 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు 57వ నిమిషంలో కిమ్ జుహున్ ఏకైక గోల్‌ను అందించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చాయి. తుదకు 39వ నిమిషంలో భారత్ సఫలమైంది. ఆకాశ్‌దీప్ అందించిన పాస్‌ను డి ఏరియాలో ఉన్న సునీల్ లక్ష్యానికి చేర్చాడు.
ఆ తర్వాత 57వ నిమిషంలో కొరియా స్కోరును సమం చేసింది. అయితే కొరియాకు ఆ ఆనందం నిమిషం కూడా నిలువలేదు. కొరియా స్కోరును సమం చేసిన వెంటనే భారత్ రెండో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మిగతా మూడు నిమిషాలు ప్రత్యర్థికి మరో గోల్ చేయనీకుండా అడ్డుకొని భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.