క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ వెల్లడి
శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్‌లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్‌కు ప్రసిద్ధి.
గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్‌కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్‌ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్‌పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే.
పిచ్‌పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్‌పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్‌పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment