![Australia 369 Allout India score 62 for 2 before rain plays spoilsport - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/17/BRISBANE-RAIN5.jpg.webp?itok=d3d2C5Rp)
ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవుట్... తర్వాతి 37 బంతుల్లో వచ్చినవి 2 పరుగులే... మరింత ఉత్సాహంతో ఆసీస్ కనిపిస్తుండగా ఒత్తిడిలో భారత జట్టు... మూడో సెషన్‌లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్‌లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్‌లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మరో 307 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా ఆదివారం ఎలా పుంజుకుంటుందో చూడాలి. అంతకుముందు కనీసం 400 పరుగుల చేయాలనే లక్ష్యంతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను అంతకంటే చాలా ముందుగా నిలిపివేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.
బ్రిస్బేన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చే పోరుకు వాన ఆటంకంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (8 బ్యాటింగ్), కెప్టెన్ అజింక్య రహానే (2 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉండగా... దూకుడుగా ఆడబోయిన రోహిత్ శర్మ (74 బంతుల్లో 44; 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 274/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 369 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (104 బంతుల్లో 50; 6 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (107 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ తలా 3 వికెట్లు తీశారు.
4 పరుగులకు 3 వికెట్లు...
శుక్రవారం సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియా ఆట ముగిద్దామని భావించిన భారత్ సఫలం కాలేకపోయింది. ఆసీస్ లోయర్ ఆర్డర్ మరోసారి చెప్పుకోదగ్గ పోరాట పటిమ కనబర్చింది. ఆరో వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం పైన్‌ను అవుట్ చేసి భారత్ రెండో రోజు తొలి వికెట్ సాధించింది. 102 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఆసీస్ కెప్టెన్ వెనుదిరిగాడు. మరో రెండు పరుగుల వ్యవధిలోనే గ్రీన్, కమిన్స్ (2) కూడా పెవిలియన్ చేరడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం లభించింది. అయితే మిషెల్ స్టార్క్ (20 నాటౌట్), కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న నాథన్ లయన్ (24) దీనికి అడ్డు పడ్డారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఆ తర్వాత హాజల్‌వుడ్ (11) సహకారంతో స్టార్క్ తమ జట్టుకు మరికొన్ని పరుగులు అందించాడు.
గిల్ విఫలం...
భారత జట్టుకు ఈసారి చెప్పుకోదగ్గ ఆరంభం అందించడంలో ఓపెనింగ్ జోడి విఫలమైంది. కమిన్స్ తన తొలి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ (7)ను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. అయితే రోహిత్ శర్మ చక్కటి షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లోనే రోహిత్ మూడు ఫోర్లు కొట్టగా... గ్రీన్ బౌలింగ్‌లో కొట్టిన స్క్వేర్ డ్రైవ్ బౌండరీ హైలైట్‌గా నిలిచింది. ఇదే జోరులో లయన్ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి కొట్టిన షాట్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పుజారా, రహానే 6.1 ఓవర్లలో 2 పరుగులే జోడించారు. టీ విరామం సమయంలో వచ్చిన వర్షం కారణంగా ఆపై ఆట సాధ్యం కాలేదు.
ఆస్ట్రేలియా అసంతృప్తి
వర్షం పూర్తిగా ఆగిపోయి దాదాపు గంట అయింది. బ్రిస్బేన్ మైదానంలోని అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ వల్ల అవుట్ ఫీల్డ్‌లో నీరు మొత్తం తోడేశారు. కవర్లు కూడా తొలగించారు. ఇక కొద్ది సేపట్లో ఆట జరగడం ఖాయమని భావించిన ఆసీస్ ఆటగాళ్లు వార్మప్ కూడా చేస్తున్నారు... ఈ దశలో అనూహ్యంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడక్కడా తడి ఉండటంతో గ్రౌండ్ అనుకూలంగా లేదని వారు భావించారు. అయితే అంపైర్ల నిర్ణయం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌ను అసంతృప్తికి గురి చేసింది. స్థానిక సమయం ప్రకారం ఆట నిర్దేశిత ముగింపు సమయంలో మరో 45 నిమిషాలు మిగిలి ఉన్నాయి. కనీసం 10 ఓవర్లు లేదంటే అరగంట ఆటైనా జరగవచ్చని ఆస్ట్రేలియా ఆశించింది. ఒత్తిడిలో ఉన్న భారత్‌ను మరింతగా ఇబ్బంది పెట్టి మరో వికెట్ సాధించగలిగినా కంగారూలకు పట్టు చిక్కినట్లే. పైగా రోహిత్‌ను అవుట్ చేసి లయన్ అప్పుడే లయ అందుకున్నాడు. ఈ సమయంలో ఆటను నిలిపివేయడంతో నిరాశకు గురైన పైన్... అంపైర్ పాల్ విల్సన్‌తో వాదించడం కనిపించింది. వాన కారణంగా కోల్పోయిన సమయాన్ని పూడ్చేందుకు మిగిలిన మూడు రోజుల్లో ప్రతీ రోజు ఆట నిర్ణీత సమయంకంటే అర గంట ముందుగా ప్రారంభమవుతుంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దుల్ 5; లబ్‌షేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దుల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ (బి) సుందర్ 47; పైన్ (సి) రోహిత్ (బి) శార్దుల్ 50; కమిన్స్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; స్టార్క్ (నాటౌట్) 20; లయన్ (బి) సుందర్ 24; హాజల్‌వుడ్ (బి) నటరాజన్ 11; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (115.2 ఓవర్లలో ఆలౌట్) 369
వికెట్ల పతనం: 1–4, 2–17, 3–87, 4–200, 5–213, 6–311, 7–313, 8–315, 9–354, 10–369.
బౌలింగ్: సిరాజ్ 28–10–77–1, నటరాజన్ 24.2–3–78–3, శార్దుల్ 24–6–94–3, సైనీ 7.5–2–21–0, సుందర్ 31–6–89–3, రోహిత్ 0.1–0–1–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) లయన్ 44, శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 7, పుజారా (బ్యాటింగ్) 8, రహానే (బ్యాటింగ్) 2, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (26 ఓవర్లలో 2 వికెట్లకు) 62.
వికెట్ల పతనం: 1–11, 2–60.
బౌలింగ్: స్టార్క్ 3–1–8–0, హాజల్‌వుడ్ 8–4–11–0, కమిన్స్ 6–1–22–1, గ్రీన్ 3–0–11–0, నాథన్ లయన్ 6–2–10–1.
Comments
Please login to add a commentAdd a comment