ఉత్సాహంతో టీమిండియా.. ఒత్తిడిలో ఆస్ట్రేలియా | Day night Test between India and Australia from today | Sakshi
Sakshi News home page

ఉత్సాహంతో టీమిండియా.. ఒత్తిడిలో ఆస్ట్రేలియా

Published Fri, Dec 6 2024 3:54 AM | Last Updated on Fri, Dec 6 2024 7:31 AM

Day night Test between India and Australia from today

నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య డే నైట్‌ టెస్టు

ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్‌–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

ఆ్రస్టేలియా గడ్డపై వరుసగా మూడోసారి టెస్టు సిరీస్‌ సాధించడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌íÙప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలనే లక్ష్యంతో టీమిండియా రెండో టెస్టుకు సమాయత్తమైంది. గతంలో ఇక్కడే జరిగిన ‘పింక్‌ బాల్‌ టెస్టు’లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు ఈసారి చరిత్ర తిరగరాయాలని భావిస్తుంటే... గులాబీ బంతితో మ్యాజిక్‌ చేయాలని ఆసీస్‌ బృందం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అడిలైడ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.  

అడిలైడ్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో భాగంగా శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే... తిరిగి పుంజుకుని సిరీస్‌ సమం చేయాలని కంగారూలు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌ ‘డే అండ్‌ నైట్‌’పద్ధతిలో ‘పింక్‌ బాల్‌’తో నిర్వహించనున్నారు. 

ఆసీస్‌ గడ్డపై చివరిసారి అడిలైడ్‌లోనే ‘గులాబీ టెస్టు’ ఆడిన భారత జట్టు తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36 ఆలౌట్‌) నమోదు చేసుకోగా... ఆ చేదు జ్ఞాపకాలను అధిగమించి ముందంజ వేయాలని టీమిండియా యోచిస్తోంది. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ రాకతో భారత జట్టు బలం మరింత పెరిగింది.  

రోహిత్‌ మిడిలార్డర్‌లో.. 
వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన రోహిత్‌... అడిలైడ్‌లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు. పెర్త్‌ టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్‌ జంట మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఈ జోడీని విడదీయడం లేదని పేర్కొన్నాడు. గాయంతో తొలి మ్యాచ్‌ ఆడని గిల్‌ మూడో స్థానంలో బరిలోకి దిగనుండగా... నాలుగో స్థానంలో కోహ్లి ఆడతాడు. 

ఆ్రస్టేలియా గడ్డపై ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి తిరిగి లయ అందుకోవడం జట్టుకు సానుకూలాంశం కాగా... మిడిలార్డర్‌లో రోహిత్, పంత్‌ బ్యాటింగ్‌ చేయనున్నారు. అడిలైడ్‌ పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నప్పటికీ ‘పింక్‌ బాల్‌’ టెస్టు కావడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వాషింగ్టన్‌ సుందర్‌వైపే మొగ్గు చూపనుంది. 

పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చోటు నిలబెట్టుకోనుండగా... హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్, హర్షిత్‌ రాణాతో కలిసి బుమ్రా పేస్‌ భారాన్ని మోయనున్నాడు. తొలి టెస్టు తర్వాత లభించిన 10 రోజుల విరామంలో భారత జట్టు పీఎం ఎలెవన్‌తో పింక్‌ బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడటంతో పాటు నెట్స్‌లో కఠోర సాధన చేసింది.  

అచ్చొచ్చిన అడిలైడ్‌లో... 
పెర్త్‌లో భారత జట్టు చేతిలో ఘోర పరాజయం తర్వాత తిరిగి పుంజుకునేందుకు ఆ్రస్టేలియా కసరత్తులు చేస్తోంది. స్వదేశంలో ఇప్పటి వరకు ఆడిన 12 ‘డే అండ్‌ నైట్‌’ మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క దాంట్లో ఓడిన ఆస్ట్రేలియా... అడిలైడ్‌లో ఆడిన 7 ‘పింక్‌ టెస్టు’ల్లోనూ విజయం సాధించింది. 

గత టెస్టులో భారత ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పేసర్‌ హాజల్‌వుడ్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా... అతడి స్థానంలో బోలాండ్‌ తుది జట్టులోకి రానున్నాడు. ఖ్వాజా, లబుషేన్, స్మిత్‌ కలిసికట్టుగా రాణించాలని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్టార్క్, కమిన్స్‌ బంతులను ఎదుర్కోవడం భారత ప్లేయర్లకు శక్తికి మించిన పనే. 

పిచ్, వాతావరణం 
అడిలైడ్‌ పిచ్‌ అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లకు సమానంగా సహకరించనుంది. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. పిచ్‌పై పచ్చిక ఉండనుంది. ఆరంభంలో పేసర్లకు అదనపు ప్రయోజనం లభించనుంది. తొలి రెండు రోజులు ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది.  

22 ఇప్పటి వరకు మొత్తం 22 డే అండ్‌ నైట్‌ టెస్టులు జరిగాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. అత్యధికంగా ఆ్రస్టేలియా జట్టు 12 డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడి 11 మ్యాచ్‌ల్లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓడింది.  

7 అడిలైడ్‌లో ఆ్రస్టేలియా జట్టు ఆడిన 7 డే అండ్‌ నైట్‌ టెస్టుల్లోనూ గెలుపొందింది.

4 భారత జట్టు ఇప్పటి వరకు 4 డే అండ్‌ నైట్‌ టెస్టులు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి (2019లో బంగ్లాదేశ్‌పై కోల్‌కతాలో; 2021లో ఇంగ్లండ్‌పై అహ్మదాబాద్‌లో; 2022లో శ్రీలంకపై బెంగళూరులో), ఒక మ్యాచ్‌లో (2020 లో ఆ్రస్టేలియా చేతిలో అడిలైడ్‌లో) ఓడిపోయింది.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లి, పంత్, సుందర్, నితీశ్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, బుమ్రా, సిరాజ్‌. 
ఆస్ట్రేలియా: కమిన్స్‌ (కెప్టెన్ ), ఖ్వాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్ , కేరీ, స్టార్క్, లయన్, బోలాండ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement