మళ్లీ జారవిడిచారు! | Australia v India: live updates from day two of the third Test at the MCG | Sakshi
Sakshi News home page

మళ్లీ జారవిడిచారు!

Published Sun, Dec 28 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

మళ్లీ జారవిడిచారు!

మళ్లీ జారవిడిచారు!

మెల్‌బోర్న్‌లోనూ అదే ఆట... గత మ్యాచ్‌లకు రీప్లే ప్రదర్శన... హాడిన్‌పై షార్ట్ బంతి ప్రయోగిస్తే వికటించింది... అసలు బ్యాటింగ్ చేయగలడా అనుకున్న 9వ నంబర్ ఆటగాడు కూడా అర్ధ సెంచరీ సాధించేశాడు. స్వయంగా వికెట్ ఇచ్చుకుంటే తప్ప స్మిత్‌పై ఎలాంటి ఎత్తుగడ పని చేయలేదు. టెస్టుల్లో కెప్టెన్‌గా తన బలహీనతను మరోసారి ప్రదర్శించిన ధోని, ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలో తెలీక చేతులెత్తేశాడు.
 
మైదానం మారినా మన బౌలింగ్, వ్యూహాలు మారలేదు. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మరోసారి చెలరేగింది. 50 వేలకు పైగా ప్రేక్షకుల ప్రోత్సాహం, సహచరుల అండతో నాయకుడు జట్టును ముందుండి నడిపించాడు. కంగారూల స్కోరు 500 దాటితే... భారత ప్రధాన బౌలర్లు నలుగురు ‘సెంచరీ’ మార్క్‌ను అందుకున్నారు. తొలి 5 వికెట్లకు ఆసీస్ 216 పరుగులు చేస్తే, మన బౌలర్ల సహకారంతో తర్వాతి 5 వికెట్లకు 314 పరుగులు చేసింది.
 
కొండంత స్కోరు ముందుండగా భారత్ నెమ్మదిగా అడుగులు వేసింది. విజయ్ మళ్లీ తన నిలకడ ప్రదర్శిస్తే, ధావన్ తనకు అలవాటైన రీతిలో నిష్ర్కమించాడు. ఇప్పుడు మన జట్టుకు కావాల్సింది ఆసీస్ రెండో రోజు ఆట స్ఫూర్తి. ఎలాంటి స్థితిలోనూ తొణకకుండా ప్రత్యర్థి చూపిన పట్టుదలతో మూడో రోజు ఎంసీజీలో టీమిండియా బ్యాట్స్‌మెన్ సత్తా చాటుతారా? లేక సాగిలపడతారా? చూడాలి.

 
తీరు మారని భారత బౌలింగ్
చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్
తొలి ఇన్నింగ్స్‌లో 530 ఆలౌట్
స్మిత్ భారీ సెంచరీ, రాణించిన హారిస్
భారత్ 108/1

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత జట్టు.. ప్రత్యర్థి భారీ స్కోరు ముందు ఎదురీదుతోంది. ఇక్కడి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్ (102 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. హారిస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (28) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ ప్రస్తుతం మరో 422 పరుగులు వెనుకబడి ఉంది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ హాడిన్ వదిలేయకపోతే భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది.
 
అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (305 బంతుల్లో 192; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, ర్యాన్ హారిస్ (88 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రాడ్ హాడిన్ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. స్మిత్... హాడిన్‌తో ఆరో వికెట్‌కు 110 పరుగులు, హారిస్‌తో ఎనిమిదో వికెట్‌కు 106 పరుగులు జత చేశాడు.

తొలి రోజు మందకొడిగా ఆడిన ఆసీస్ రెండో రోజు మాత్రం ధాటిని ప్రదర్శించింది. భారత పేలవ బౌలింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ఆ జట్టు 5.18 రన్‌రేట్‌తో 52.3 ఓవర్లలోనే 271 పరుగులు జోడించడం విశేషం.  షమీ అయితే పూర్తిగా గతి తప్పాడు. మిగతా ముగ్గురు బౌలర్లు కలిసి 29 ఫోర్లు ఇస్తే, అతనొక్కడే 23 బౌండరీలు ఇచ్చాడు. షమీ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు.
 
స్కోరు వివరాలు:

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) షమీ 57; వార్నర్ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వాట్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 52; స్మిత్ (బి) ఉమేశ్ 192; మార్ష్ (సి) ధోని (బి) షమీ 32; బర్న్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; హాడిన్ (సి) ధోని (బి) షమీ 55; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 28; హారిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 74; లయోన్ (బి) షమీ 11; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్) 530
 వికెట్ల పతనం: 1-0; 2-115; 3-115; 4-184; 5-216; 6-326; 7-376; 8-482; 9-530; 10-530.
 బౌలింగ్: ఇషాంత్ 32-7-104-0; ఉమేశ్ 32.3-3-130-3; షమీ 29-4-138-4; అశ్విన్ 44-9-134-3; విజయ్ 5-0-14-0.
 
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 55; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (37 ఓవర్లలో వికెట్ నష్టానికి) 108
 వికెట్ల పతనం: 1-55.
 బౌలింగ్: జాన్సన్ 9-3-24-0; హారిస్ 7-3-19-1; హాజల్‌వుడ్ 9-4-19-0; వాట్సన్ 4-0-14-0; లయోన్ 8-0-32-0.
 
 
కెప్టెన్‌గా తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆటగాడు స్మిత్. ఆస్ట్రేలియా తరఫున తొలి క్రికెటర్. 2007-08లో హేడెన్ తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆసీస్ ఆటగాడు కూడా స్మిత్ కావడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి అత్యధిక స్టంపింగ్‌లు (134) చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. సంగక్కర (133)ను అతను అధిగమించాడు. అలాగే టెస్టుల్లో 38 స్టంపింగ్‌లతో భారత్ తరఫున కిర్మాణీ (38)తో సమంగా నిలిచాడు.
నలుగురు భారత బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులు ఇవ్వడం 2014లో ఇది నాలుగోసారి. ఈ ఏడాది టీమిండియా తరఫున వేర్వేరు మ్యాచ్‌ల్లో ఏకంగా 26 సార్లు ఇలా పరుగులిచ్చారు. గతంలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఏ జట్టు కూడా 18 సార్లకు మించి సమర్పించలేదు.
 
భారీగా పరుగులు ఇచ్చుకోవడం నిరాశకు గురి చేసింది. ఈ వికెట్‌పై పరుగులకు మంచి అవకాశముంది కాబట్టి మేమూ భారీ స్కోరు చేస్తాం. మాకు ఆరంభం లభించింది కూడా. హాడిన్ షార్ట్ బంతులు ఆడలేడనే అలా బౌలింగ్ చేశాం. స్మిత్‌అలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థికి కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ రెండు రోజులు నా బౌలింగ్‌తో సంతృప్తి చెందా                -అశ్విన్, భారత స్పిన్నర్
 
 
మా జట్టు భారీ స్కోరు చేయడం సంతోషంగా ఉంది. క్రీజ్‌లో అన్ని నాకు అనుకూలంగా జరిగాయి. మా చివరి వరుస బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. దీనికి భారత్ వద్ద సమాధానం లేకపోయింది. డబుల్ సెంచరీ కోల్పోవడం పట్ల నిరాశగా లేను. వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేయాలనుకున్నా. చివర్లో మరిన్ని వికెట్లు తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే మూడు రోజు ఆరంభంలో ఆ పని చేయగలం     -స్టీవెన్ స్మిత్, ఆసీస్ కెప్టెన్
 
సెషన్-1: ఆస్ట్రేలియా దూకుడు
ఓవర్‌నైట్ స్కోరు 259/5తో ఆసీస్ ఆట ప్రారంభించింది. హాడిన్ షార్ట్ బంతుల బలహీనత తెలిసిన భారత బౌలర్లు పదే పదే అవే బంతులు వేశారు. అయితే ఇది సత్ఫలితం ఇవ్వలేదు. షమీ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాది హాడిన్ జవాబిచ్చాడు. ఇదే క్రమంలో 75 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతనికి ఇదే తొలి అర్ధ సెంచరీ. మరోవైపు 191 బంతుల్లో స్మిత్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. హాడిన్ అవుటయ్యాక వచ్చిన జాన్సన్ కూడా ఉమేశ్, షమీ బౌలింగ్‌లలో వరుసగా రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
 ఓవర్లు: 25, పరుగులు: 130, వికెట్లు: 2
 
సెషన్-2: అదే జోరు
లంచ్ తర్వాత కూడా స్మిత్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అనూహ్యంగా హారిస్ నుంచి కూడా భారత బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. అశ్విన్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి అతనూ ఆధిక్యం ప్రదర్శించాడు. చివరకు అశ్విన్ బౌలింగ్‌లోనే భారీ సిక్సర్ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి అవుటయ్యాడు. 273 బంతుల్లో 150 పరుగులు అందుకున్న స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే ఇదే జోరులో ఉమేశ్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్ ఆడబోయి వికెట్లు వదిలేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
 ఓవర్లు: 27.3, పరుగులు: 141, వికెట్లు: 3
 
సెషన్-3: ఆకట్టుకున్న విజయ్
ఫామ్‌లో ఉన్న మురళీ విజయ్ మరోసారి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించగా, ధావన్ కాస్త తడబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. వాట్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కాస్త దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసిన ధావన్, హారిస్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు విజయ్ మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు. సంయమనం కోల్పోకుండా ఆడిన అతను 93 బంతుల్లో ఈ సిరీస్‌లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాడిన్ చలవతో బతికిపోయిన పుజారా కూడా ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు.
ఓవర్లు: 37, పరుగులు: 108, వికెట్లు: 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement