Australias batsmen
-
హ్యూస్... నీ కోసం!
సహచరుడు నేలకూలిన చోటు అది... కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు పడిపోయిన పిచ్ అది... తనకి నివాళి అర్పించడానికేనేమో... సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఫిల్ హ్యూస్ బంతి తగిలి కుప్పకూలిన సిడ్నీ పిచ్‌పై పరుగుల వరద పారించారు. ఆప్తమిత్రుడిని గుర్తు చేసుకుంటూ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగితే... రోజర్స్, స్మిత్, వాట్సన్ ఒక్కరేంటి... క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఆడుకున్నారు. ఫలితంగా నాలుగో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా భారీస్కోరు చేసింది. సిడ్నీ: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు మరో రోజు భారంగా గడిచింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెలరేగారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. క్రమశిక్షణ తప్పిన మన బౌలింగ్‌తో పాటు ఫీల్డర్ల వైఫల్యాలు కూడా ఆసీస్‌కు కలిసొచ్చాయి. డేవిడ్ వార్నర్ (114 బంతుల్లో 101; 16 ఫోర్లు) ఈ సిరీస్‌లో మూడో సెంచరీ నమోదు చేయడం విశేషం. మరో ఓపెనర్ క్రిస్ రోజర్స్ (160 బంతుల్లో 95; 13 ఫోర్లు) త్రుటిలో శతకం కోల్పోయాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 200 పరుగులు జోడించారు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (134 బంతుల్లో 82 బ్యాటింగ్; 10 ఫోర్లు) సిరీస్‌లో తన జోరు కొనసాగించగా... వాట్సన్ (132 బంతుల్లో 61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 144 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో షమీ, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (బ్యాటింగ్) 61; స్మిత్ (బ్యాటింగ్) 82; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 348. వికెట్ల పతనం: 1-200; 2-204. బౌలింగ్: భువనేశ్వర్ 20-2-67-0; ఉమేశ్ 16-1-97-0; షమీ 16-2-58-1; అశ్విన్ 28-5-88-1; రైనా 10-2-35-0. సెషన్-1: ఓపెనర్ల శుభారంభం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే వార్నర్, రోజర్స్ ధాటిగా ఆడారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఉమేశ్ పూర్తిగా బంతిపై పట్టు కోల్పోగా, షమీ, అశ్విన్ మాత్రం కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశారు. మొదటి 15 ఓవర్లలోనే ఆసీస్ 79 పరుగులు చేసింది. ఇదే ఊపులో ముందుగా వార్నర్ 45 బంతుల్లో, ఆ తర్వాత రోజర్స్ 91 బం తుల్లో అర్ధ సెంచరీలు చేశారు. రోజర్స్‌కు ఈ సిరీస్‌లో వరుసగా ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఓవర్లు: 28, పరుగులు: 123, వికెట్లు: 0 సెషన్-2: కాస్త ఊరట లంచ్ తర్వాత కూడా ఆసీస్ ఆటగాళ్లు అదే జోరును ప్రదర్శించారు. వరుస బౌండరీలతో చెలరేగారు. షమీ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ కొట్టిన వార్నర్ 108 బంతుల్లో కెరీర్లో 12వ సెంచరీని అందుకున్నాడు. ఎట్టకేలకు 45వ ఓవర్లో భారత్ శ్రమకు ఫలితం లభించింది. అశ్విన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన వార్నర్, గల్లీలో విజయ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే షమీ దెబ్బ తీశాడు. బంతిని వికెట్లపైకి ఆడుకున్న రోజర్స్, మరోసారి సెంచరీ చేజారడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఓవర్లు: 32, పరుగులు: 119, వికెట్లు: 2 సెషన్-3: భారీ భాగస్వామ్యం చివరి సెషన్లో మరో సారి భారత్ తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. స్టీవెన్ స్మిత్ తనదైన శైలిలో చక్కటి షాట్లతో దూసుకుపోగా, మరో వైపు వాట్సన్ మాత్రం ప్రతీ పరుగు కోసం శ్రమించాడు. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. 67 బంతుల్లోనే స్మిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వాట్సన్ 99 బంతుల్లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. కోహ్లి పదే పదే బౌలర్లను మార్చినా, కొత్త బంతి తీసుకొని ఎంత శ్రమించినా భారత్‌కు మరో వికెట్ మాత్రం దక్కలేదు. ఓవర్లు: 30, పరుగులు: 106, వికెట్లు: 0 వార్నర్ ‘నివాళి’ ఫిల్ హ్యూస్కు అత్యంత ఆత్మీయుడైన డేవిడ్ వార్నర్ సిడ్నీ టెస్టు తొలి రోజు తన భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. లంచ్‌కు ముందు షమీ బౌలింగ్‌లో లాంగ్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీసిన వార్నర్ 63 పరుగులకు (హ్యూస్ చివరి ఇన్నింగ్స్ స్కోరు) చేరుకున్నాడు. అంతే... ఆ సమయంలో ఒక్కసారిగా అతనికి ఆరు వారాల క్రితంనాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. సిడ్నీ మైదానంలో అబాట్ బంతికి హ్యూస్ కుప్ప కూలిన చోటుకు వార్నర్ చేరుకున్నాడు. క్రీజ్‌కు పక్కన ఉన్న ఆ ప్రదేశంపై కిందికి వంగి మైదానాన్ని ముద్దాడాడు! ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంలోనూ వార్నర్, తన బ్యాట్‌కు ఆకాశానికేసి చూపించి తన మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు. మైకేల్ క్లార్క్ కూడా... అంతకు ముందు హ్యూస్‌ను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిడ్నీ మైదానంలోని మెంబర్స్ పెవిలియన్ ముందు హ్యూస్ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. వార్నర్ బ్యాటింగ్‌కు దిగుతూ దానిని చేత్తో తాకి మైదానంలోకి ప్రవేశించాడు. స్టేడియంలో పెద్ద స్క్రీన్‌పై హ్యూస్ చిత్రం కనిపిస్తుండగా జాతీయ గీతాలాపన జరిగింది. ఆ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు నిలబడి హ్యూస్కు నివాళి అర్పించారు. హ్యూస్ తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి కూడా దీనికి హాజరయ్యారు. వారితో పాటే ఉన్న మైకేల్ క్లార్క్ మరో సారి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రక్త సంబంధం లేకపోయినా తనకు అతను సోదరుడి లాంటివాడని, తామిద్దరం కలిసి అనేక ఆనందకర క్షణాలు గడిపినట్లు క్లార్క్ చెప్పాడు. ఆ రెండు క్యాచ్‌లు... తొలి రోజు భారత ీఫీల్డర్లు కూడా ఆసీస్‌కు అండగా నిలిచారు 19 పరుగుల వద్ద రోజర్స్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు. ఆఖరి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను అశ్విన్ నేలపాలు చేశాడు. 14 ఏళ్ల తర్వాత కోహ్లి నేతృత్వంలో టెస్టు బరిలోకి దిగిన భారత్ తుదిజట్టులో అనూహ్యంగా నాలుగు మార్పులు చేసింది. రిటైరైన ధోని స్థానంలో సాహా, గాయపడిన ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ వచ్చారు. ధావన్, పుజారాకు బదులుగా రోహిత్, రైనాలకు అవకాశం లభించింది. తుది జట్టులో కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ఒక్కరు కూడా లేకుండా భారత్ బరిలోకి దిగడం 2001 తర్వాత ఇదే తొలి సారి. 2001లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఆడిన భారత జట్టులో ఒక్కరికి కూడా 50 టెస్టులు ఆడిన అనుభవం లేదు. జట్టులో అప్పుడు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన (48) క్రికెటర్ ద్రవిడ్. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 77 పరుగుల తేడాతో ఓడింది. ప్రస్తుత టెస్టులో కోహ్లి (33 టెస్టులు)నే అందరికంటే సీనియర్. ‘హ్యూస్కు ఏదో తరహాలో నివాళి అర్పించాలని మ్యాచ్‌కు ముందే భావించాను. ఇప్పుడు నేను చేసిందదే. ఇక్కడ ఎప్పుడు ఆడినా అదే చేస్తాను. ఆ రోజు జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదలాడాయి. అతని కుటుంబ సభ్యులను ఈ రోజు ఉదయం చూశాక నాకు కన్నీరు ఆగలేదు. చివరకు ఎలాగో నియంత్రించుకోగలిగాను. మేం టాస్ గెలవడం కలిసొచ్చింది. ఇప్పుడు చాలా పటిష్ట స్థితిలో ఉన్నాం. స్మిత్, వాట్సన్ దీనిని కొనసాగిస్తారనే భావిస్తున్నా. బౌలింగ్‌కు వికెట్ ఏ మాత్రం అనుకూలించడం లేదు. మేం కూడా 10 వికెట్లు తీయాలంటే చాలా కష్ట పడాల్సిందే’ - వార్నర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ -
మళ్లీ జారవిడిచారు!
మెల్‌బోర్న్‌లోనూ అదే ఆట... గత మ్యాచ్‌లకు రీప్లే ప్రదర్శన... హాడిన్పై షార్ట్ బంతి ప్రయోగిస్తే వికటించింది... అసలు బ్యాటింగ్ చేయగలడా అనుకున్న 9వ నంబర్ ఆటగాడు కూడా అర్ధ సెంచరీ సాధించేశాడు. స్వయంగా వికెట్ ఇచ్చుకుంటే తప్ప స్మిత్‌పై ఎలాంటి ఎత్తుగడ పని చేయలేదు. టెస్టుల్లో కెప్టెన్‌గా తన బలహీనతను మరోసారి ప్రదర్శించిన ధోని, ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలో తెలీక చేతులెత్తేశాడు. మైదానం మారినా మన బౌలింగ్, వ్యూహాలు మారలేదు. ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ మరోసారి చెలరేగింది. 50 వేలకు పైగా ప్రేక్షకుల ప్రోత్సాహం, సహచరుల అండతో నాయకుడు జట్టును ముందుండి నడిపించాడు. కంగారూల స్కోరు 500 దాటితే... భారత ప్రధాన బౌలర్లు నలుగురు ‘సెంచరీ’ మార్క్‌ను అందుకున్నారు. తొలి 5 వికెట్లకు ఆసీస్ 216 పరుగులు చేస్తే, మన బౌలర్ల సహకారంతో తర్వాతి 5 వికెట్లకు 314 పరుగులు చేసింది. కొండంత స్కోరు ముందుండగా భారత్ నెమ్మదిగా అడుగులు వేసింది. విజయ్ మళ్లీ తన నిలకడ ప్రదర్శిస్తే, ధావన్ తనకు అలవాటైన రీతిలో నిష్ర్కమించాడు. ఇప్పుడు మన జట్టుకు కావాల్సింది ఆసీస్ రెండో రోజు ఆట స్ఫూర్తి. ఎలాంటి స్థితిలోనూ తొణకకుండా ప్రత్యర్థి చూపిన పట్టుదలతో మూడో రోజు ఎంసీజీలో టీమిండియా బ్యాట్స్‌మెన్ సత్తా చాటుతారా? లేక సాగిలపడతారా? చూడాలి. తీరు మారని భారత బౌలింగ్ ⇒ చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ⇒ తొలి ఇన్నింగ్స్‌లో 530 ఆలౌట్ ⇒ స్మిత్ భారీ సెంచరీ, రాణించిన హారిస్ ⇒ భారత్ 108/1 మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత జట్టు.. ప్రత్యర్థి భారీ స్కోరు ముందు ఎదురీదుతోంది. ఇక్కడి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 108 పరుగులు చేసింది. మురళీ విజయ్ (102 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. హారిస్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (28) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ ప్రస్తుతం మరో 422 పరుగులు వెనుకబడి ఉంది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ హాడిన్ వదిలేయకపోతే భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (305 బంతుల్లో 192; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా, ర్యాన్ హారిస్ (88 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రాడ్ హాడిన్ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. స్మిత్... హాడిన్‌తో ఆరో వికెట్‌కు 110 పరుగులు, హారిస్‌తో ఎనిమిదో వికెట్‌కు 106 పరుగులు జత చేశాడు. తొలి రోజు మందకొడిగా ఆడిన ఆసీస్ రెండో రోజు మాత్రం ధాటిని ప్రదర్శించింది. భారత పేలవ బౌలింగ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న ఆ జట్టు 5.18 రన్‌రేట్‌తో 52.3 ఓవర్లలోనే 271 పరుగులు జోడించడం విశేషం. షమీ అయితే పూర్తిగా గతి తప్పాడు. మిగతా ముగ్గురు బౌలర్లు కలిసి 29 ఫోర్లు ఇస్తే, అతనొక్కడే 23 బౌండరీలు ఇచ్చాడు. షమీ 4 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) షమీ 57; వార్నర్ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వాట్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 52; స్మిత్ (బి) ఉమేశ్ 192; మార్ష్ (సి) ధోని (బి) షమీ 32; బర్న్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 13; హాడిన్ (సి) ధోని (బి) షమీ 55; జాన్సన్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 28; హారిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 74; లయోన్ (బి) షమీ 11; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్) 530 వికెట్ల పతనం: 1-0; 2-115; 3-115; 4-184; 5-216; 6-326; 7-376; 8-482; 9-530; 10-530. బౌలింగ్: ఇషాంత్ 32-7-104-0; ఉమేశ్ 32.3-3-130-3; షమీ 29-4-138-4; అశ్విన్ 44-9-134-3; విజయ్ 5-0-14-0. భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (బ్యాటింగ్) 55; ధావన్ (సి) స్మిత్ (బి) హారిస్ 28; పుజారా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (37 ఓవర్లలో వికెట్ నష్టానికి) 108 వికెట్ల పతనం: 1-55. బౌలింగ్: జాన్సన్ 9-3-24-0; హారిస్ 7-3-19-1; హాజల్‌వుడ్ 9-4-19-0; వాట్సన్ 4-0-14-0; లయోన్ 8-0-32-0. ⇒ కెప్టెన్‌గా తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆటగాడు స్మిత్. ఆస్ట్రేలియా తరఫున తొలి క్రికెటర్. 2007-08లో హేడెన్ తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆసీస్ ఆటగాడు కూడా స్మిత్ కావడం విశేషం. ⇒ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక స్టంపింగ్‌లు (134) చేసిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. సంగక్కర (133)ను అతను అధిగమించాడు. అలాగే టెస్టుల్లో 38 స్టంపింగ్‌లతో భారత్ తరఫున కిర్మాణీ (38)తో సమంగా నిలిచాడు. ⇒ నలుగురు భారత బౌలర్లు ఒకే ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగులు ఇవ్వడం 2014లో ఇది నాలుగోసారి. ఈ ఏడాది టీమిండియా తరఫున వేర్వేరు మ్యాచ్‌ల్లో ఏకంగా 26 సార్లు ఇలా పరుగులిచ్చారు. గతంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో ఏ జట్టు కూడా 18 సార్లకు మించి సమర్పించలేదు. భారీగా పరుగులు ఇచ్చుకోవడం నిరాశకు గురి చేసింది. ఈ వికెట్‌పై పరుగులకు మంచి అవకాశముంది కాబట్టి మేమూ భారీ స్కోరు చేస్తాం. మాకు ఆరంభం లభించింది కూడా. హాడిన్ షార్ట్ బంతులు ఆడలేడనే అలా బౌలింగ్ చేశాం. స్మిత్అలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థికి కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ రెండు రోజులు నా బౌలింగ్‌తో సంతృప్తి చెందా -అశ్విన్, భారత స్పిన్నర్ మా జట్టు భారీ స్కోరు చేయడం సంతోషంగా ఉంది. క్రీజ్‌లో అన్ని నాకు అనుకూలంగా జరిగాయి. మా చివరి వరుస బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. దీనికి భారత్ వద్ద సమాధానం లేకపోయింది. డబుల్ సెంచరీ కోల్పోవడం పట్ల నిరాశగా లేను. వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేయాలనుకున్నా. చివర్లో మరిన్ని వికెట్లు తీసి ఉంటే ఇంకా బాగుండేది. అయితే మూడు రోజు ఆరంభంలో ఆ పని చేయగలం -స్టీవెన్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ సెషన్-1: ఆస్ట్రేలియా దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 259/5తో ఆసీస్ ఆట ప్రారంభించింది. హాడిన్ షార్ట్ బంతుల బలహీనత తెలిసిన భారత బౌలర్లు పదే పదే అవే బంతులు వేశారు. అయితే ఇది సత్ఫలితం ఇవ్వలేదు. షమీ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాది హాడిన్ జవాబిచ్చాడు. ఇదే క్రమంలో 75 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతనికి ఇదే తొలి అర్ధ సెంచరీ. మరోవైపు 191 బంతుల్లో స్మిత్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో శతకాన్ని సాధించాడు. హాడిన్ అవుటయ్యాక వచ్చిన జాన్సన్ కూడా ఉమేశ్, షమీ బౌలింగ్‌లలో వరుసగా రెండేసి ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఓవర్లు: 25, పరుగులు: 130, వికెట్లు: 2 సెషన్-2: అదే జోరు లంచ్ తర్వాత కూడా స్మిత్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. అనూహ్యంగా హారిస్ నుంచి కూడా భారత బౌలర్లకు ప్రతిఘటన ఎదురైంది. అశ్విన్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి అతనూ ఆధిక్యం ప్రదర్శించాడు. చివరకు అశ్విన్ బౌలింగ్‌లోనే భారీ సిక్సర్ కొట్టిన అనంతరం తర్వాతి బంతికి అవుటయ్యాడు. 273 బంతుల్లో 150 పరుగులు అందుకున్న స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే ఇదే జోరులో ఉమేశ్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్ ఆడబోయి వికెట్లు వదిలేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లు: 27.3, పరుగులు: 141, వికెట్లు: 3 సెషన్-3: ఆకట్టుకున్న విజయ్ ఫామ్‌లో ఉన్న మురళీ విజయ్ మరోసారి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించగా, ధావన్ కాస్త తడబడ్డాడు. ఆసీస్ బౌలర్లు కూడా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. వాట్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కాస్త దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసిన ధావన్, హారిస్ వేసిన తర్వాతి ఓవర్లోనే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు విజయ్ మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు. సంయమనం కోల్పోకుండా ఆడిన అతను 93 బంతుల్లో ఈ సిరీస్‌లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాడిన్ చలవతో బతికిపోయిన పుజారా కూడా ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు. ఓవర్లు: 37, పరుగులు: 108, వికెట్లు: 1