హ్యూస్... నీ కోసం!
సహచరుడు నేలకూలిన చోటు అది... కళ్ల ముందే ప్రాణ స్నేహితుడు పడిపోయిన పిచ్ అది... తనకి నివాళి అర్పించడానికేనేమో... సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. ఫిల్ హ్యూస్ బంతి తగిలి కుప్పకూలిన సిడ్నీ పిచ్‌పై పరుగుల వరద పారించారు. ఆప్తమిత్రుడిని గుర్తు చేసుకుంటూ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగితే... రోజర్స్, స్మిత్, వాట్సన్ ఒక్కరేంటి... క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఆడుకున్నారు. ఫలితంగా నాలుగో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా భారీస్కోరు చేసింది.
సిడ్నీ: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు మరో రోజు భారంగా గడిచింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెలరేగారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. క్రమశిక్షణ తప్పిన మన బౌలింగ్‌తో పాటు ఫీల్డర్ల వైఫల్యాలు కూడా ఆసీస్‌కు కలిసొచ్చాయి.
డేవిడ్ వార్నర్ (114 బంతుల్లో 101; 16 ఫోర్లు) ఈ సిరీస్‌లో మూడో సెంచరీ నమోదు చేయడం విశేషం. మరో ఓపెనర్ క్రిస్ రోజర్స్ (160 బంతుల్లో 95; 13 ఫోర్లు) త్రుటిలో శతకం కోల్పోయాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 200 పరుగులు జోడించారు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (134 బంతుల్లో 82 బ్యాటింగ్; 10 ఫోర్లు) సిరీస్‌లో తన జోరు కొనసాగించగా... వాట్సన్ (132 బంతుల్లో 61 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 144 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో షమీ, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (బ్యాటింగ్) 61; స్మిత్ (బ్యాటింగ్) 82; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 348.
వికెట్ల పతనం: 1-200; 2-204.
బౌలింగ్: భువనేశ్వర్ 20-2-67-0; ఉమేశ్ 16-1-97-0; షమీ 16-2-58-1; అశ్విన్ 28-5-88-1; రైనా 10-2-35-0.
సెషన్-1: ఓపెనర్ల శుభారంభం
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే వార్నర్, రోజర్స్ ధాటిగా ఆడారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఉమేశ్ పూర్తిగా బంతిపై పట్టు కోల్పోగా, షమీ, అశ్విన్ మాత్రం కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశారు. మొదటి 15 ఓవర్లలోనే ఆసీస్ 79 పరుగులు చేసింది. ఇదే ఊపులో ముందుగా వార్నర్ 45 బంతుల్లో, ఆ తర్వాత రోజర్స్ 91 బం తుల్లో అర్ధ సెంచరీలు చేశారు. రోజర్స్‌కు ఈ సిరీస్‌లో వరుసగా ఐదో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
ఓవర్లు: 28, పరుగులు: 123, వికెట్లు: 0
సెషన్-2: కాస్త ఊరట
లంచ్ తర్వాత కూడా ఆసీస్ ఆటగాళ్లు అదే జోరును ప్రదర్శించారు. వరుస బౌండరీలతో చెలరేగారు. షమీ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ కొట్టిన వార్నర్ 108 బంతుల్లో కెరీర్‌లో 12వ సెంచరీని అందుకున్నాడు. ఎట్టకేలకు 45వ ఓవర్లో భారత్ శ్రమకు ఫలితం లభించింది. అశ్విన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన వార్నర్, గల్లీలో విజయ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే షమీ దెబ్బ తీశాడు. బంతిని వికెట్లపైకి ఆడుకున్న రోజర్స్, మరోసారి సెంచరీ చేజారడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఓవర్లు: 32, పరుగులు: 119, వికెట్లు: 2
సెషన్-3: భారీ భాగస్వామ్యం
చివరి సెషన్‌లో మరో సారి భారత్ తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. స్టీవెన్ స్మిత్ తనదైన శైలిలో చక్కటి షాట్లతో దూసుకుపోగా, మరో వైపు వాట్సన్ మాత్రం ప్రతీ పరుగు కోసం శ్రమించాడు. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. 67 బంతుల్లోనే స్మిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వాట్సన్ 99 బంతుల్లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. కోహ్లి పదే పదే బౌలర్లను మార్చినా, కొత్త బంతి తీసుకొని ఎంత శ్రమించినా భారత్‌కు మరో వికెట్ మాత్రం దక్కలేదు.
ఓవర్లు: 30, పరుగులు: 106, వికెట్లు: 0
వార్నర్ ‘నివాళి’
ఫిల్ హ్యూస్‌కు అత్యంత ఆత్మీయుడైన డేవిడ్ వార్నర్ సిడ్నీ టెస్టు తొలి రోజు తన భావోద్వేగాలు దాచుకోలేకపోయాడు. లంచ్‌కు ముందు షమీ బౌలింగ్‌లో లాంగ్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీసిన వార్నర్ 63 పరుగులకు (హ్యూస్ చివరి ఇన్నింగ్స్ స్కోరు) చేరుకున్నాడు. అంతే... ఆ సమయంలో ఒక్కసారిగా అతనికి ఆరు వారాల క్రితంనాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
సిడ్నీ మైదానంలో అబాట్ బంతికి హ్యూస్ కుప్ప కూలిన చోటుకు వార్నర్ చేరుకున్నాడు. క్రీజ్‌కు పక్కన ఉన్న ఆ ప్రదేశంపై కిందికి వంగి మైదానాన్ని ముద్దాడాడు! ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంలోనూ వార్నర్, తన బ్యాట్‌కు ఆకాశానికేసి చూపించి తన మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు.
మైకేల్ క్లార్క్ కూడా...
అంతకు ముందు హ్యూస్‌ను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిడ్నీ మైదానంలోని మెంబర్స్ పెవిలియన్ ముందు హ్యూస్ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. వార్నర్ బ్యాటింగ్‌కు దిగుతూ దానిని చేత్తో తాకి మైదానంలోకి ప్రవేశించాడు. స్టేడియంలో పెద్ద స్క్రీన్‌పై హ్యూస్ చిత్రం కనిపిస్తుండగా జాతీయ గీతాలాపన జరిగింది.
ఆ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు నిలబడి హ్యూస్‌కు నివాళి అర్పించారు. హ్యూస్ తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి కూడా దీనికి హాజరయ్యారు. వారితో పాటే ఉన్న మైకేల్ క్లార్క్ మరో సారి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రక్త సంబంధం లేకపోయినా తనకు అతను సోదరుడి లాంటివాడని, తామిద్దరం కలిసి అనేక ఆనందకర క్షణాలు గడిపినట్లు క్లార్క్ చెప్పాడు.
ఆ రెండు క్యాచ్‌లు...
తొలి రోజు భారత ీఫీల్డర్లు కూడా ఆసీస్‌కు అండగా నిలిచారు 19 పరుగుల వద్ద రోజర్స్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు. ఆఖరి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను అశ్విన్ నేలపాలు చేశాడు.
14 ఏళ్ల తర్వాత
కోహ్లి నేతృత్వంలో టెస్టు బరిలోకి దిగిన భారత్ తుదిజట్టులో అనూహ్యంగా నాలుగు మార్పులు చేసింది. రిటైరైన ధోని స్థానంలో సాహా, గాయపడిన ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ వచ్చారు. ధావన్, పుజారాకు బదులుగా రోహిత్, రైనాలకు అవకాశం లభించింది.
తుది జట్టులో కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ఒక్కరు కూడా లేకుండా భారత్ బరిలోకి దిగడం 2001 తర్వాత ఇదే తొలి సారి. 2001లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఆడిన భారత జట్టులో ఒక్కరికి కూడా 50 టెస్టులు ఆడిన అనుభవం లేదు. జట్టులో అప్పుడు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన (48) క్రికెటర్ ద్రవిడ్. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 77 పరుగుల తేడాతో ఓడింది. ప్రస్తుత టెస్టులో కోహ్లి (33 టెస్టులు)నే అందరికంటే సీనియర్.
‘హ్యూస్‌కు ఏదో తరహాలో నివాళి అర్పించాలని మ్యాచ్‌కు ముందే భావించాను. ఇప్పుడు నేను చేసిందదే. ఇక్కడ ఎప్పుడు ఆడినా అదే చేస్తాను. ఆ రోజు జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదలాడాయి. అతని కుటుంబ సభ్యులను ఈ రోజు ఉదయం చూశాక నాకు కన్నీరు ఆగలేదు. చివరకు ఎలాగో నియంత్రించుకోగలిగాను. మేం టాస్ గెలవడం కలిసొచ్చింది. ఇప్పుడు చాలా పటిష్ట స్థితిలో ఉన్నాం. స్మిత్, వాట్సన్ దీనిని కొనసాగిస్తారనే భావిస్తున్నా. బౌలింగ్‌కు వికెట్ ఏ మాత్రం అనుకూలించడం లేదు. మేం కూడా 10 వికెట్లు తీయాలంటే చాలా కష్ట పడాల్సిందే’
- వార్నర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్