కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–10, 21–10తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. 30 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్‌లో స్కోరు 11–9 వద్ద గాయత్రి–ట్రెసా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 19–9తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత ఒక పాయింట్ ప్రత్యర్థి జంట నెగ్గినా ఆ వెంటనే భారత జోడీ రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 7–21తో చి యు జెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
పైకప్పు నుంచి నీరు కారడంతో...
టోర్నీ తొలి రోజు భారత ప్లేయర్ ప్రణయ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. కోర్టు–3లో కెనడా ప్లేయర్ బ్రియాన్ యాంగ్‌తో మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను 21–12తో నెగ్గి, రెండో గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో స్టేడియం పైకప్పు నుంచి అనూహ్యంగా వర్షం నీరు కోర్టులోకి పడటం మొదలైంది. దాంతో కోర్టు–3లో ప్రణయ్ మ్యాచ్ నిలిచిపోయింది.
గంట తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. ప్రణయ్ 9–11తో వెనుకంజలో ఉన్న దశలో మళ్లీ పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. దాంతో నిర్వాహకులు ప్రణయ్, యాంగ్ మ్యాచ్‌ను నిలిపివేసి బుధవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment