నాకు ఆశ్చర్యం కలిగించలేదు: దాదా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సాధించడం టీమిండియాకు గొప్ప విజయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. భారత ఆటగాళ్లు బాగా రాణించారని అన్నాడు. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ గెలుపొంది.. 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.
'టీమిండియాకిది గొప్ప విజయం. గ్రేట్ సమ్మర్. ఈ విజయం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే భారత గడ్డపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం. 2001లో ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. నా క్రికెట్ కెరీర్‌లో నేను చూసిన అత్యంత బలమైన జట్టు అప్పటి ఆస్ట్రేలియానే. అయినా కంగారూలు టీమిండియాను ఓడించలేకపోయారు. ఈ సిరీస్‌లో కూడా ఆసీస్ 1-0తో ముందంజలో ఉన్నా చివరకు ఓటమి తప్పలేదు. ప్రపంచంలో ఏ జట్టుకైనా భారత్‌లో సిరీస్‌ను గెలవడం సవాలే' అని దాదా అన్నాడు. సిరీస్‌లో ఓడినా ఆసీస్ పోరాట పటిమ కనబరిచిందని ప్రశంసించాడు.