‘డ్రా’తో గట్టెక్కారు | India in Australia: After MCG Draw, Gavaskar, Shastri Clash Over Team's Mindset | Sakshi
Sakshi News home page

‘డ్రా’తో గట్టెక్కారు

Published Wed, Dec 31 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

‘డ్రా’తో గట్టెక్కారు

‘డ్రా’తో గట్టెక్కారు

70 ఓవర్లు.... 384 పరుగుల లక్ష్యం... ఒక దశలో భారత్ స్కోరు 19 పరుగులకే 3 వికెట్లు... మరో పరాభవం తప్పదనుకుంటున్న వేళ... కోహ్లి, రహానే మళ్లీ ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులు మాటలతో కాక పుట్టించినా... భయంకరమైన బంతులతో విరుచుకుపడినా... పట్టుదలతో పోరాడి క్రీజ్‌లో నిలిచారు. మ్యాచ్‌ను ‘డ్రా’ దిశగా మళ్లించారు. కొద్దితేడాలో కోహ్లి, రహానే, పుజారా అవుటైనా... చివర్లో ఒత్తిడికి తట్టుకొని ధోని, అశ్విన్ స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత్‌ను గట్టెక్కించారు. విజయంతో కాకుండా ‘డ్రా’తోనే సరిపెడదామని భావించిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ చాలా ఆలస్యంగా డిక్లేర్ చేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది.
 
సిరీస్ 2-0తో ఆస్ట్రేలియా వశం

రాణించిన కోహ్లి, రహానే
వచ్చే నెల 6 నుంచి నాలుగో టెస్టు

మెల్‌బోర్న్: ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూడో టెస్టు నాటకీయ పరిణామాల మధ్య ‘డ్రా’గా ముగిసింది. ఆట మొత్తం ఆసీస్ ఆధిపత్యం చూపినా... ఆఖరి రోజు సహనంతో ఆడిన భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చకచకా వికెట్లు చేజార్చుకున్నా... చివరి సెషన్ మొత్తం నిలకడను చూపిన టీమిండియా కంగారూల విజయానికి బ్రేక్ వేసింది. దీంతో ఎంసీజీలో భారత్, ఆసీస్‌ల మధ్య జరిగిన మూడో టెస్టు ‘డ్రా’ అయ్యింది. ఫలితంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే స్మిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది.

384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. కోహ్లి (99 బంతుల్లో 54; 7 ఫోర్లు), రహానే (117 బంతుల్లో 48; 6 ఫోర్లు) మరోసారి ఆకట్టుకున్నారు. పుజారా (21), ధోని (39 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అంతకుముందు 261/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 98 ఓవర్లలో 9 వికెట్లకు 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మార్ష్ (215 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.
 
చకచకా...
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు... ఆరంభంలోనే కంగారూలు షాక్ ఇచ్చారు. కట్టుదిట్టమైన బంతులతో చెలరేగుతూ 9 ఓవర్లలోపే ధావన్ (0), రాహుల్ (1), విజయ్ (11)లను అవుట్ చేశారు. దీంతో భారత్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లికి జత కలిసిన రహానే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడు గంటలకు పైగా ఓపికగా బ్యాటింగ్ చేసి చేజారిపోయిన మ్యాచ్‌ను ‘డ్రా’వైపు మళ్లించారు. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే కోహ్లి అవుట్ కావడంతో ఆసీస్‌కు విజయంపై ఆశ పుట్టింది. కానీ పుజారా నిలకడను చూపడంతో కంగారూలకు నిరాశ తప్పలేదు.

దాదాపు 16.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన చతేశ్వర్ ఐదో వికెట్‌కు రహానేతో కలిసి 37 పరుగులు జోడించి అవుటయ్యాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత రహానే కూడా వెనుదిరగడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. అయితే చివర్లో ధోని, అశ్విన్ (34 బంతుల్లో 8 నాటౌట్) ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివరకు మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే స్మిత్ ‘డ్రా’కు అంగీకరించాడు. ఫలితంగా 1997 తర్వాత మరోసారి మెల్‌బోర్న్ మైదానంలో జరిగిన టెస్టు ‘డ్రా’గా ముగిసింది. హారిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని చివరిదైన నాలుగో టెస్టు జనవరి 6 నుంచి సిడ్నీలో జరుగుతుంది.
 
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 530; భారత్ తొలి ఇన్నింగ్స్: 465; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్ప్: 318/9 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యూ (బి) హాజల్‌వుడ్ 11; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) హారిస్ 0; రాహుల్ (సి) వాట్సన్ (బి) జాన్సన్ 1; కోహ్లి (సి) బర్న్స్ (బి) హారిస్ 54; రహానే (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 48; పుజారా (బి) జాన్సన్ 21; ధోని నాటౌట్ 24; అశ్విన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (66 ఓవర్లలో 6 వికెట్లకు) 174
వికెట్ల పతనం: 1-2; 2-5; 3-19; 4-104; 5-141; 6-142
బౌలింగ్: జాన్సన్ 15-3-38-2; హారిస్ 16-8-30-2; హాజల్‌వుడ్ 15-3-40-2; లయోన్ 12-0-36-0; వాట్సన్ 6-1-14-0; స్మిత్ 2-0-10-0.
 
‘ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో మేం ఎంచుకున్న మార్గాలు మాకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మ్యాచ్ మొత్తం కొనసాగించాలి. మ్యాచ్ ‘డ్రా’ అయినందుకు కాస్త సంతోషమే. చివరి రోజు ఆట వల్లే ఇది సాధ్యమైంది. కొత్త కుర్రాళ్లు కుదురుకోవడానికి సమయం ఇవ్వాలి’-ధోని (భారత కెప్టెన్)
 
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచినందుకు సంతోషంగా ఉంది. చివరిసారి చెత్తగా ఓడాం. మళ్లీ ఇప్పుడు అనుకున్నది సాధించాం. వచ్చేసారి భారత్‌కు వెళ్లినప్పుడు మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. డిక్లేర్ విషయంలో రెండుసార్లు పునరాలోచించా. అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయా. అడిలైడ్ కంటే ఈ పిచ్ కాస్త మెరుగ్గా ఉం డటంతో ఆలస్యం చేశా’  - స్మిత్ (ఆసీస్ కెప్టెన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement