ఎప్పట్లాగే భారత్ స్పిన్ అస్త్రంతోనే రంగంలోకి దిగుతుందని... వార్మప్‌లో పేస్ పిచ్‌తో మభ్యపెడుతుందని ఆస్ట్రేలియా సన్నాహక మ్యాచ్ అక్కర్లేదంది. నెట్స్‌లో అదేపనిగా స్పిన్ బౌలింగ్‌లోనే శ్రమించింది. అశ్విన్‌ను పోలిన డూప్లికేట్ బౌలర్‌తో తెగ ప్రాక్టీస్ చేసింది. ఇంత చేసినా ‘కంగారు’ తప్పలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరిన జట్టు అనూహ్యంగా మూడే రోజుల్లో చిత్తయ్యింది. భారత్ భారీ విజయంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌ను ప్రారంభించింది.
నాగ్‌పూర్: ఆస్ట్రేలియా భయపడినట్లే జరిగింది. భారత్ స్పిన్ అస్త్రంతోనే గెలిచింది. అయితే కంగారూ టీమ్ చేసిన కసరత్తుకు ఓడిన తీరుకు ఏ మాత్రం పొంతనే లేదు. ఆసీస్‌లాంటి మేటి జట్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 100 (తొలి ఇన్నింగ్స్‌లో 63.5; రెండో ఇన్నింగ్స్‌లో 32.3) ఓవర్లయినా ఆడకపోవడం... మ్యాచ్ మూడో రోజే ముగిసిపోవడం మాత్రం ఎవరూ ఊహించనిది. తొలి ఇన్నింగ్స్‌ను జడేజా (5/47, 2/34) కూల్చినట్లే... రెండో ఇన్నింగ్స్‌ను అశ్విన్ (3/42, 5/37) పడగొట్టేశాడు. దీంతో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1–0తో ముందడుగు వేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆట మొదలైందిలా...
ఓవర్‌నైట్ స్కోరు 321/7తో మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 139.3 ఓవర్లలో సరిగ్గా 400 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 4 పరుగులే చేసి మర్ఫీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) తొలి సెషన్‌లో కుదురుగా ఆడాడు. మిగిలిన టెయిలెండర్ల సాయంతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. షమీ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
తమ ప్రధాన బ్యాటర్లను వణికించిన మర్ఫీ బౌలింగ్‌లో షమీ వరుస సిక్సర్లతో అలరించాడు. అయితే షమీని మర్ఫీ తన మరుసటి ఓవర్లో బోల్తా కొట్టించాడు. దీంతో తొమ్మిదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సిరాజ్ (1 నాటౌట్) అండతో జట్టు స్కోరును 400 పరుగులకు చేర్చిన అక్షర్‌ను అదే స్కోరు వద్ద కమిన్స్ బౌల్డ్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగుల ఆధిక్యం సాధించింది. అరంగేట్రం చేసిన బౌలర్ మర్ఫీ ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు.
ఆసీస్ కూలిందిలా...
లంచ్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొదలైంది. కానీ మూడో సెషన్‌కు ముందే 32.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఒకే ఒక్క సెషన్‌లో అగ్రశ్రేణి జట్టయిన ఆసీస్ మొత్తం 10 వికెట్లను కోల్పోవడం గమనార్హం. రెండో ఓవర్ నుంచే అశ్విన్‌ను రంగంలోకి దించడం... అతను ఉస్మాన్ ఖాజా (5)ను పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ పతనం శరవేగంగా మొదలై అంతే వేగంగా ముగిసింది. కీలక వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్ (17)ను జడేజా అవుట్ చేయగా, మిగతా బ్యాటర్లు వార్నర్ (10), రెన్‌షా (2), హ్యాండ్స్‌కోంబ్ (6), క్యారి (10)లను అశ్విన్ తన వరుస ఓవర్లలో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 20వ ఓవర్ పూర్తవకముందే ఆసీస్ 64/6 స్కోరుతో ఇన్నింగ్స్ పరాజయానికి సిద్ధమైంది. తర్వాత అక్షర్ (1/6), జడేజా (2/34), షమీ (2/13) తలా ఒక చేయి వేయడంతో ఆస్ట్రేలియా వంద పరుగులైనా చేయలేకపోయింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177;
భారత్ తొలి ఇన్నింగ్స్: 400.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సి) కోహ్లి (బి) అశ్విన్ 5; వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 10; లబుషేన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; స్మిత్ (నాటౌట్) 25; రెన్‌షా (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; హ్యాండ్స్‌కోంబ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) అశ్విన్ 6; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 10; కమిన్స్ (సి) భరత్ (బి) జడేజా 1; మర్ఫీ (సి) రోహిత్ (బి) అక్షర్ 2; లయన్ (బి) షమీ 8; బోలండ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (32.3 ఓవర్లలో ఆలౌట్) 91. వికెట్ల పతనం: 1–7, 2–26, 3–34, 4–42, 5–52, 6–64, 7–67, 8–75, 9–88, 10–91. బౌలింగ్: షమీ 4.3–1–13–2, అశ్విన్ 12–3–37–5, సిరాజ్ 1–1–0–0, జడేజా 12–3–34–2, అక్షర్ 3–0–6–1.
91: భారత గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియాకిది అత్యల్ప స్కోరు. 2004లో ముంబైలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 93 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా భారత్‌పై ఆస్ట్రేలియాకిది రెండో అత్యల్ప స్కోరు. 1981 మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా 83 పరుగులకు ఆలౌటైంది.
25: భారత్‌లో అశ్విన్ టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 25వసారి. తాజా ప్రదర్శనతో అనిల్ కుంబ్లే (25 సార్లు) సరసన అశ్విన్ నిలిచాడు. స్వదేశంలో అత్యధికంగా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (45 సార్లు), రంగన హెరాత్ (26 సార్లు) ఉన్నారు.
5: ఆస్ట్రేలియాపై భారత జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించడం ఇది ఐదోసారి. చివరిసారి భారత్ 2013లో హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ విజయం అందుకుంది.
10: నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు పదిసార్లు ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యారు. వారి టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2001లో కోల్‌కతా టెస్టులో, గత ఏడాది శ్రీలంకపై గాలె టెస్టులో తొమ్మిదిమంది బ్యాటర్లు ఎల్బీగా వెనుదిరిగారు. భారత బౌలర్లు కూడా ఓ టెస్టులో పదిసార్లు ఎల్బీగా అవుట్ చేయడం ఇదే తొలిసారి.
జడేజాకు జరిమానా
తొలి టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజాపై జరిమానా పడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సమయంలో స్పిన్నర్ అంపైర్ల అనుమతి తీసుకోకుండా తన చేతి వేలు వాపు తగ్గేందుకు అయింట్‌మెంట్ రాశాడు. ఇది కాస్తా బాల్ ట్యాంపరింగ్ అనుమానాల్ని రేకేత్తించగా... మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ వీడియోల్ని పరిశీలించి ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తేల్చారు. అయితే అంపైర్ల అనుమతి లేకుండా అలా చేయడం ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని... మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment