సమాధానం దొరికిందా? | Has India finally found a fast-bowling all-rounder in Hardik Pandya? | Sakshi
Sakshi News home page

సమాధానం దొరికిందా?

Published Tue, Oct 18 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

సమాధానం దొరికిందా?

సమాధానం దొరికిందా?

భారత్‌కు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టు నిరీక్షణ ఇది. కపిల్‌దేవ్ రిటైర్ అయిన తర్వాత ఎంతో మందిని పరీక్షించారు. రకరకాల ఆటగాళ్లను తెచ్చి అవకాశాలు కల్పించారు. కానీ ఇప్పటికీ ఆ లోటు తీరలేదు. కానీ ధర్మశాలలో న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసిన తర్వాత భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కష్టాలకు సమాధానం దొరికిందేమో అనిపిస్తోంది. ఒక్క మ్యాచ్‌లో మంచి ప్రదర్శనకే అతడిని పూర్తిగా ఆల్‌రౌండర్ అనడం తొందరపాటే కావచ్చు. కానీ పాండ్యా గత ఆరు నెలల కాలంలో పడిన కష్టం, మార్చుకున్న శైలి, తొలి వన్డేలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే... అన్నీ మంచి శకునాలుగానే కనిపిస్తున్నాయి.   
 
 సాక్షి క్రీడావిభాగం
 పది నెలల క్రితం... ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో భారత్ టి20 మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన తొలి ఓవర్లో వరుసగా మొదటి మూడు బంతులూ వైడ్లు వేశాడు. ఓ సిక్సర్, ఓ ఫోర్ ఇచ్చాడు. మరో రెండు వైడ్లతో కలిపి మొత్తం ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేశాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు ఓవర్లలో ఏకంగా 37 పరుగులు ఇచ్చాడు. అయినా ధోనికి పాండ్యా మీద విశ్వాసం ఉంది. ఐపీఎల్‌లో తన ప్రదర్శనను రెండేళ్లపాటు చూసిన ఎవరికై నా పాండ్యా మీద నమ్మకం ఉంటుంది.

 అదే నమ్మకం వల్ల అతను టి20 ప్రపంచకప్ వరకూ భారత్ ఆడిన 16 టి20ల్లోనూ బరిలోకి దిగాడు. నిజానికి అతను హిట్టింగ్ బాగా చేయగల బ్యాట్స్‌మన్. అవసరమైతే మీడియం పేసర్‌గా రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఇంతకాలం పాండ్యా పాత్ర ఇదే. ఐపీఎల్‌లోనూ కొత్త బంతితో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. నిజానికి ఆ పర్యటనకు పాండ్యా వెళతాడనే అనుకున్నారు. కానీ ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులోకి రాలేదు.

 కట్ చేస్తే... ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో భారత్ తొలి వన్డే. ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ పూర్తి కాగానే ధోని బంతిని పాండ్యా వైపు విసిరాడు. ఇది అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. తొలి ఐదు బంతుల్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టాడు. అయితే మూడూ మంచి బంతులే. ఎడ్‌‌జలు తీసుకుని బౌండరీకి వెళ్లాయి. దీంతో ధోని అదనంగా మరో స్లిప్ తెచ్చాడు. ఆఖరి బంతికి స్లిప్స్‌లోనే క్యాచ్ ఇచ్చి గప్టిల్ వెనుదిరిగాడు. పాండ్యా పది నెలల క్రితం వేసిన తొలి ఓవర్‌కీ ఈ ఓవర్‌కీ ఏ మాత్రం సంబంధం లేదు. ఈసారి ఆత్మవిశ్వాసం కనిపించింది. ఫలితంతో సంబంధం లేకుండా అతను బంతులు వేయాల్సిన విధానం గురించి మాత్రమే ఆలోచించాడు. ఫలితం... ఏ ఆటగాడైనా కలలుగనే అరంగేట్రం. ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.

 లెగ్ స్పిన్నర్‌గా మొదలై...
 నిజానికి పాండ్యా కెరీర్ బ్యాట్స్‌మన్‌గానే మొదలైంది. అయితే అడపాదడపా లెగ్ స్పిన్ వేసేవాడు. అరుుతే ఓ రోజు నెట్స్‌లో అనుకోకుండా పేస్ బౌలింగ్ వేశాడు. అప్పటికి తను ఇంకా క్లబ్ క్రికెటర్ మాత్రమే. 2013లో ఓ క్లబ్ గేమ్ ద్వారానే పాండ్యాలోని పేస్ బౌలర్ బయటకు వచ్చాడు. పిచ్ మొత్తం పచ్చికతో ఉంది. జట్టులో సరైన పేసర్లు లేరు. దీంతో పాండ్యాకు కొత్త బంతి ఇచ్చారు. అతను ఏకంగా ఎనిమిది వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించాడు. బరోడా రంజీ కోచ్ సనత్ కుమార్ ఇది చూశారు. దీంతో హార్దిక్‌ను పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చే ప్రయత్నం చేశారు. 2015 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్‌‌స జట్టులో ప్రదర్శన ద్వారా పాండ్యా కెరీర్ ఒక్కసారిగా మారిపోరుుంది. అరుుతే కేవలం భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మన్‌గానే అతనికి గుర్తింపు లభించింది. నిజానికి పాండ్యా తన పేస్ బౌలింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. దీనికి కారణం గాయాలు. 2013లో తను పేస్ బౌలర్‌గా మారిన తర్వాత కనీసం నెలకు ఒకసారైనా ఏదో ఒక గాయం బారిన పడ్డాడు.

 ఫిట్‌నెస్ పెరిగింది
 పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవంగా ఆడాడు. భారత టి20 ఆటగాడిగా జట్టులో కీలకంగా మారాల్సిన హార్దిక్... ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం 44 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ విఫలమై మూడు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో భారత ద్వితీయశ్రేణి జట్టులోనూ  తనకు చోటు దక్కలేదు. ఈ దశలో తన కెరీర్ వెనకబడిందని భావించిన పాండ్యా... మళ్లీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టాడు. ఈసారి ఆట కంటే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ‘ఎ’ జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లినా పెద్దగా రాణించలేదు. అరుుతే అక్కడ కూడా ఫిట్‌నెస్‌నే ప్రధాన ఎజెం డాగా పెట్టుకున్నాడు.

 ప్రయోగాల వేళ...
 నిజానికి పాండ్యా వన్డే జట్టులోకి వస్తాడనే ఆలోచన ఎవరిలోనూ లేదు. అరుుతే ఇంగ్లండ్‌లో వచ్చే ఏడాది చాంపియన్‌‌స ట్రోఫీని నిలబెట్టుకోవాలనే అజెండాతో ప్రస్తుతం భారత్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఆ మెగా టోర్నీకి ముందు ఉన్న ఎనిమిది వన్డేల ద్వారా రకరకాల ఆటగాళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే కచ్చితంగా జట్టులో ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండాలి. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ కాకుండా దేశవాళీ క్రికెట్‌లో కనిపిస్తున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం హార్దిక్ పాండ్యా. దీంతో జట్టులో చోటు దక్కింది. నెట్స్‌లో తను బంతులు వేసిన తీరు కెప్టెన్ ధోనితో పాటు కోచ్ కుంబ్లేను కూడా ఆకర్షించింది.

పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేయగలడు. కానీ ఈసారి ఏకంగా 140 కిలోమీటర్లను మించిన వేగంతోనూ బంతులు వేశాడు. ఇది ధోనికి పెద్ద రిలీఫ్ ఇచ్చిం ది. ‘తుది జట్టులో ఉండే ముగ్గురు సీమర్లలో అతను ఒకడిగా ఎదిగితే మాకు చాలా సమస్యలు తగ్గిపోతారుు. చాలా మంది బౌలర్లు బంతిని స్వింగ్ చేయలేని పిచ్‌లపై కూడా పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేస్తాడు. తొలి వన్డేలో అతని బంతుల్లో వేగం కూడా పెరిగింది. ఒకసారి కొత్త బంతి ఇచ్చి చూడాలని భావించాం. అతను కొత్త బంతిని బాగా వాడితే... బుమ్రాను మధ్య ఓవర్లలో, స్లాగ్ ఓవర్లలో వాడుకోవచ్చు. ఇదే తరహాలో పాండ్యా బౌలింగ్ చేస్తే చాంపియన్‌‌స ట్రోఫీ సమయానికి అతనే మా మొదటి పేసర్ కూడా కావచ్చు’ అంటూ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు.
 
 రానున్న మ్యాచ్‌లు కీలకం
 వచ్చే ఏడాది చాంపియన్‌‌స ట్రోఫీకి తుది జట్టులో బెర్త్ పాండ్యాకు కచ్చితంగా ఖరారరుుందని చెప్పలేం. రాబోయే మ్యాచ్‌లలో అతను బౌలర్‌గా ఎలాంటి ప్రభావం చూపుతాడనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. మిగిలిన మ్యాచ్‌లు జరిగే వికెట్లు కూడా ధర్మశాల తరహాలో పేసర్లకు సహకరించకపోవచ్చు. అరుుతే తొలి వన్డే ఇచ్చిన ఆత్మవిశ్వాసం పాండ్యాను ముందుకు తీసుకువెళుతుంది. 38 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోజునే.. పాండ్యా కూడా తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు. తన క్యాప్ కూడా ఆ దిగ్గజం చేతుల మీదుగానే అందుకున్నాడు. మరి ఆ దిగ్గజం వారసుడి కోసం రెండు దశాబ్దాలుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సమాధానంగా హార్దిక్ పాండ్యా ఎదుగుతాడా..? రాబోయే పదిహేను రోజుల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement