మనం ఇన్నాళ్లు సీక్వెల్ సినిమాలెన్నో చూశాం. కానీ ఇప్పుడే సీక్వెల్‌గా ఉత్కం‘టై’న మ్యాచ్‌లు చూస్తున్నాం. మొన్న షమీ చెలరేగితే... రోహిత్ అదరగొట్టేశాడు. కానీ ఆ ‘టైబ్రేక్’లో వీళ్లిద్దరు సీనియర్లు. ఇప్పుడైతే శార్దుల్‌కు అంతగా అనుభవమే లేదు. పైగా భారత్‌కు మ్యాచ్‌పై పట్టులేదు. ఎవరికీ గెలుపుపై ఆశే లేదు. ఇలాంటి సమయంలో సంచలన బౌలింగ్‌తో శార్దుల్ కివీస్‌ను కట్టడి చేయడంతో స్కోర్లు సమమైంది. అంతే ఆట సూపర్‌కెళ్లింది. భారత్ చితగ్గొట్టింది. అలా రెండో సీక్వెల్ ‘టైబ్రేక్’లోనూ టీమిండియానే పైచేయి సాధించింది. క్లీన్‌స్వీప్ దారిలో నాలుగో అడుగు పడింది. ఇక మిగిలిందొక్కటే!
న్యూజిలాండ్‌పై 20వ ఓవర్‌ను చూస్తే... వారెవ్వా శార్దుల్ అనే అంటాం. చివరకు ‘సూపర్’ ఫలితాన్ని చూస్తే మాత్రం ఏ కాస్త కనికరమున్నా... అయ్యో పాపం కివీస్ అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఆఖరిదాకా వచ్చి ఓడిపోయిందని జాలనిపిస్తుంది. ఇలా సూపర్ ఓవర్లో పదేపదే ఓడితే మాత్రం కచ్చితంగా ఎవరైన పాపమనే అంటారు. గత పదేళ్లుగా ఆరు మ్యాచ్‌ల్లో (ఒక వన్డే కలుపుకొని) సూపర్‌దాకా వెళ్లిన న్యూజిలాండ్ గెలుపును మాత్రం సాకారం చేసుకోలేకపోయింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా...ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 6 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి.
వెల్లింగ్టన్: గత మ్యాచ్ టై... ఈ మ్యాచ్ టై... అప్పుడు సూపర్, ఇప్పుడు సూపర్... అయినా విన్నర్ మారలేదు. కివీస్ తలరాత కూడా మారలేదు. మూడో మ్యాచ్‌లో ఆఖరి బంతులు భారత్‌కు అనూహ్య గెలుపునివ్వగా... ఈ మ్యాచ్‌లో శార్దుల్ అద్బుత బౌలింగ్ ప్రదర్శన భారత్ గెలిచేందుకు ఊపిరి పోసింది. శుక్రవారం కూడా ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది.
మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నాడు. సోధి 3, బెన్నెట్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మన్రో (47 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సీఫెర్ట్ (39 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఆదుకున్న పాండే
మనీశ్ పాండే షాట్
మళ్లీ టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్ రాహుల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. అతనితో ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ సామ్సన్ (8) సహా కెప్టెన్ కోహ్లి (11), శ్రేయస్ అయ్యర్ (1), శివమ్ దూబే (12) అంతా విఫలం కాగా... టీమిండియా 12 ఓవర్లు ముగియక ముందే 88 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మనీశ్ పాండే చేసిన ఫిఫ్టీనే ‘శతక’మంత సాయం చేసింది. టెయిలెండర్లు శార్దుల్ (15 బంతుల్లో 20; 2ఫోర్లు), సైనీ (11 నాటౌట్) అండతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
మన్రో, సీఫెర్ట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఏమంత కష్టం కానీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ ‘పవర్ ప్లే’లో గప్టిల్ (4) వికెట్ కోల్పోయింది. మన్రో, సీఫెర్ట్‌ల రెండో వికెట్ భాగస్వామ్యం 74 పరుగులకు చేరడం, జట్టు స్కోరు వందకు సమీపించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఎట్టకేలకు రనౌట్ రూపంలో మన్రో, పరుగు వ్యవధిలో బ్రూస్ (0) ఔట్ కావడంతో చిగురించిన ఆశలపై సీఫెర్ట్, టేలర్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు) నీళ్లుచల్లారు. 19 ఓవర్లలో కివీస్ స్కోరు 159/3. అప్పటికే సీఫెర్ట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది.
టేలర్ ఔట్ – సీఫెర్ట్ రనౌట్
ఇంకా చేతిలో 7 వికెట్లుండటం... 6 బంతుల్లో విజయానికి 7 పరుగులు అవసరముండటంతో కివీస్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ చివరి ఓవర్ తొలి బంతి నుంచే గెలుపు మలుపు తీసుకుంది. శార్దుల్ వేసిన ఫుల్‌లెంత్ డెలివరీని లాఫ్టెడ్ షాట్ ఆడగా అది మిడ్ వికెట్‌లో అయ్యర్ చేతికి చిక్కింది. క్రీజ్‌లోకి వచ్చిన మిచెల్ వస్తూనే బౌండరీ కొట్టాడు. ఇక మిగిలింది 3 పరుగులైతే 4 బంతులున్నాయి. మూడో బంతి మిచెల్‌ను బీట్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లగా పరుగందుకున్న సీఫెర్ట్ వచ్చే లోపే రాహుల్ వికెట్లకు గిరాటేయడంతో అతను రనౌటయ్యాడు. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. నాలుగో బంతికి ఓ పరుగుతీశాడు.
ఐదో బంతిని మిచెల్ (4) గాల్లోకి లేపాడు. మిడాఫ్‌లో ఉన్న దూబే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి వుండగా సాన్‌ట్నర్ ఒక పరుగు మాత్రమే పూర్తి చేశాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించగా డీప్ పాయింట్‌లో ఉన్న సామ్సన్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని కీపర్‌కు అందించాడు. రెప్పపాటు వ్యవధిలోనే రాహుల్ వికెట్లను కూల్చేయడంతో సాన్‌ట్నర్ (2) రనౌట్. మ్యాచ్ టై అయ్యింది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతినిచ్చి సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, సైనిలకు అవకాశమిచ్చింది. కానీ ఈ ముగ్గుర్లో ఎవరూ రాణించలేదు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
‘ప్రత్యర్థి ఎంత బాగా ఆడుతున్నా చివరి వరకు ప్రశాంతంగా ఉండి పోరాడాలని ఈ రెండు మ్యాచ్‌లు నాకు నేర్పించాయి. ఇంతకంటే అద్భుతమైన మ్యాచ్‌లను ఆశించలేం. గతంలో ఎప్పుడూ సూపర్ ఓవర్ ఆడని మేం ఇప్పుడు వరుసగా రెండు గెలిచాం. సూపర్ ఓవర్లో సామ్సన్‌తో ఓపెనింగ్ చేయించాలనుకున్నా నా అనుభవం పనికొస్తుందని రాహుల్ చెప్పడంతో నేనే బ్యాటింగ్‌కు వచ్చాను. మా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా’ –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి)సాన్‌ట్నర్ (బి) సోధి 39; సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్‌లీన్ 8; కోహ్లి (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 11; అయ్యర్ (సి) సీఫెర్ట్ (బి) సోధి 1; దూబే (సి) బ్రూస్ (బి) సోధి 12; పాండే నాటౌట్ 50; సుందర్ (బి) సాన్‌ట్నర్ 0; శార్దుల్ (సి) సౌతీ (బి) బెన్నెట్ 20; చహల్ (సి) íసీఫెర్ట్ (బి) సౌతీ 1; సైనీ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–14, 2–48, 3–52, 4–75, 5–84, 6–88, 7–131, 8–143. బౌలింగ్: సౌతీ 4–0–28–1, కుగ్‌లీన్ 4–0–39–1, సాన్‌ట్నర్ 4–0–26–1, బెన్నెట్ 4–0–41–2, సోధి 4–0–26–3.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 4; మన్రో రనౌట్ 64; íసీఫెర్ట్ రనౌట్ 57; బ్రూస్ (బి) చహల్ 0; టేలర్ (సి) అయ్యర్ (బి) ఠాకూర్ 24; మిచెల్ (సి) దూబే (బి) ఠాకూర్ 4; సాన్‌ట్నర్ రనౌట్ 2; కుగ్‌లీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–22, 2–96, 3–97, 4–159, 5–163, 6–164, 7–165. బౌలింగ్: శార్దుల్ 4–0–33–2, సైనీ 4–0–29–0, బుమ్రా 4–0–20–1, చహల్ 4–0–38–1, సుందర్ 2–0–24–0, దూబే 2–0–14–0.
Comments
Please login to add a commentAdd a comment