ప్రయోగాలు చేస్తారా! | Fourth T20 Match For India VS New Zealand | Sakshi
Sakshi News home page

ప్రయోగాలు చేస్తారా!

Published Fri, Jan 31 2020 3:08 AM | Last Updated on Fri, Jan 31 2020 6:02 AM

Fourth T20 Match For India VS New Zealand - Sakshi

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ ఖాతాలో ఇప్పటికే టి20 సిరీస్‌ చేరింది. గత మ్యాచ్‌లో దక్కిన అనూహ్య విజయం తర్వాత టీమిండియా శిబిరంలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయినా సరే, క్లీన్‌స్వీప్‌ కోసం ప్రయత్నిస్తామని కెప్టెన్‌ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడా ఉదాసీనత కనబర్చరాదని జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో అవకాశం దక్కని సభ్యులను ఆడిస్తారా లేదా అనేది ప్రస్తుతం భారత జట్టు కూర్పుకు సంబంధించి ఆసక్తి కలిగించే అంశం. మరోవైపు గెలుపు అంచుల వరకు వెళ్లి కూడా దురదృష్టం వెంటాడిన న్యూజిలాండ్‌ తాజా పరాజయం నుంచి కోలుకొని నాలుగో మ్యాచ్‌లో ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి.

వెల్లింగ్టన్‌: అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్‌ అదే ఊపును కొనసాగించి ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సన్నద్ధమైంది. నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే మన జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్‌ చెలగాటం...మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రాణసంకటంగా తయారైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో కివీస్‌ బృందం ఉంది.  

తుది జట్టులోకి ఎవరు? 
రిషభ్‌ పంత్, సంజు సామ్సన్, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్‌... ఈ పర్యటనలో ఇంకా అవకాశం దక్కని ఐదుగురు భారత క్రికెటర్లు. వీరిలో కనీసం ఇద్దరికైనా నేటి మ్యాచ్‌ తుది జట్టులో స్థానం లభించవచ్చని అంచనా. ముఖ్యంగా గత ఏడాది కాలంగా భారత బౌలర్లలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీకి విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అతని స్థానంలో నవదీప్‌ సైనీని ఎంచుకోవచ్చు. టి20 ప్రపంచ కప్‌ ప్రణాళికల్లో సైనీ కూడా భాగంగా ఉన్నాడు కాబట్టి అతనిని ఆడించాలని కెప్టెన్‌ భావిస్తున్నాడు. చహల్‌ స్థానంలో కుల్దీప్, జడేజాకు బదులుగా సుందర్‌లను ఎంచుకోవచ్చనేది కూడా అంచనా. వీరిలో ఎవరు వచ్చినా భారత జట్టు స్వరూపం ఒక్కసారిగా మారిపోదు కాబట్టి జట్టు బలమేమీ తగ్గదు.

బ్యాటింగ్‌ విభాగంలో కూడా ఎవరినీ తప్పించే అవకాశం లేదు కాబట్టి పంత్, సామ్సన్‌ తమ అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే. రాహుల్‌ ఇటీవలి ప్రదర్శన తర్వాత మరో కీపర్‌ గురించి జట్టు ఆలోచించడం లేదు. అదే విధంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న నేపథ్యంలో మార్పు కష్టమే. మరో రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే పేరుకు తుది జట్టులో ఉన్నా అతను చివర్లో వస్తుండటంతో ఎక్కువ బ్యాటింగ్‌ అవకాశం దక్కలేదు. కాబట్టి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అతడిని ముందుగా పంపించే అవకాశం ఉంది. దూబే కూడా మళ్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగవచ్చు.  

ఎలా ఆడాలో?  
అత్యంత అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్, టి20 మ్యాచ్‌లో 4 బంతుల్లో విజయానికి 2 పరుగులు కావాలి... కానీ ఇలాంటి స్థితిలో కూడా కివీస్‌ మ్యాచ్‌ చేజార్చుకుందంటే అది పెద్ద వైఫల్యం కిందే లెక్క! ఇలాంటి విషాదం నుంచి కోలుకొని న్యూజిలాండ్‌ మళ్లీ సత్తా చాటాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే మూడో టి20లో నిజానికి న్యూజిలాండ్‌ మెరుగ్గా ఆడింది. ఇప్పుడు దాదాపు అదే జట్టుతో మరోసారి కివీస్‌ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

గ్రాండ్‌హోమ్‌ స్థానంలో బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ డరైన్‌ మిషెల్‌ రావడం మాత్రం ఖాయమైంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు టేలర్‌ బ్యాటింగ్‌పై జట్టు ఆధారపడుతోంది. మూడో మ్యాచ్‌లో విలియమ్సన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ అతని స్థాయి ఏమిటో చూపించింది. ఈ సారైనా అతని ప్రదర్శన గెలుపునందించాలని కివీస్‌ కోరుకుంటోంది. బౌలింగ్‌ విభాగం ఎప్పటిలాగే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. సౌతీ అనుభవం పెద్దగా అక్కరకు రాలేదు. ఇప్పటి వరకు సిరీస్‌లో విఫలమైన సాన్‌ట్నర్‌ తనకు అచ్చొచ్చిన ఇక్కడి మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాడు.

తుది జట్లు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, సుందర్, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, సైనీ.  
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్, మన్రో, రాస్‌ టేలర్, డరైన్‌ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, టిమ్‌ సౌతీ, సోధి, బెన్నెట్‌.

పిచ్, వాతావరణం 
వెస్ట్‌పాక్‌ స్టేడియంలోని పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణంతో సమస్య లేదు. 2014 నుంచి ఇక్కడ ఆడిన వరుస ఆరు మ్యాచ్‌లలో కూడా న్యూజిలాండ్‌ విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement