క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్‌లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు.
‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment