ఈ అమ్మాయి ఆల్‌రౌండర్!
అమెరికాలో ఉంటున్న భారతీయసంతతి అమ్మాయి సురభిని చూస్తే ముచ్చటేస్తుంది. పదిహేనేళ్ల సురభి బెరివాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రైటర్, డ్యాన్సర్, ఫైటర్‌గా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సురభి చదువులో కూడా దూసుకుపోతోంది. స్పానిష్ భాష నేర్చుకొని ‘నేషనల్ స్పానిష్ ఎగ్జామ్’లో బంగారు పతకాన్ని అందుకుంది. ‘‘రచన అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెబుతున్న సురభి కోల్‌కతాలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(అమెరికా)కు వచ్చింది.
వ్యాసాలు, నాటికలు, కవిత్వం రాయడం అంటే సురభికి చాలా ఇష్టం. ‘ఆస్క్ ఆల్సన్’ పేరుతో ఆమె రాసిన నాటికకు మంచి పేరు వచ్చింది. వివిధ సామాజిక సమస్యపై సురభి రాసిన వ్యాసాలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. గత సంవత్సరం ఫోర్త్-డిగ్రీ బ్లాక్‌బెల్ట్ తీసుకోవడం ద్వారా కరాటేలో తన సత్తా చాటింది సురభి. స్కూల్ ‘స్పీచ్ అండ్ డిబేట్ టీమ్’కు సెక్రటరీగా మంచి మార్కులు కొట్టేసింది. స్వచ్ఛంద సేవ అంటే సురభికి చాలా ఇష్టం. స్థానిక రోటరీ క్లబ్, స్కూల్‌లోని ‘నేషనల్ హానర్స్ సొసైటీ’ తరఫున ఎన్నో రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంది.
‘‘ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. గాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ బోధనల గురించి ఎప్పుడూ చెబుతుంటారు’’ అంటుంది సురభి. తన సోదరుడు సంజీత్ తరచుగా గుర్తు చేసే వాక్యం- ‘కల కను. కలను నిజం చేసుకో’ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న యువతను ఉద్దేశించి ఒక నవల రాసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది సురభి.