నాకు ఈ మధ్యనే డెలివరీ అయ్యింది. ఆసుపత్రిలో నాతో పాటు డెలివరీ అయిన వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు మాత్రం చాలా బాధగా, ఒంటరిగా ఉన్నానని అనిపిస్తోంది. నేనెందుకు నాలాగ ఉండలేకపోతున్నానో తెలియడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. – ప్రభారాణి, అమీన్‌పూర్
డెలివరీ అనేది చాలా ముఖ్యమైన దశ. చాలామందికి ఉత్తేజంగా, ఆనందంగా, ఒక సవాలుగా ఉంటుంది. కొంతమందికి తల్లిని కాబోతున్నాను అనే ఆనందంతో పాటు కొంత ఆందోళన, ఒత్తిడి, దిగులు ఉంటాయి. ఇది సర్వసాధారణం. అయితే కొంతమందికి ఈ మార్పులు తట్టుకోవడం కష్టం కావచ్చు. ఇలాంటి వారికి అధిక సంరక్షణ అవసరం. మీలోని భావాలను ఇంకొకరితో పంచుకుంటే మంచిది. బ్లాగ్స్, న్యూస్‌పేపర్, సోషల్‌మీడియాలో కూడా వ్యక్తపరచవచ్చు.
ఎవరికీ చెప్పకుండా, మీలోని మార్పులకి కారణం తెలియక ఇబ్బంది పడకూడదు. మీ గైనకాలజిస్ట్‌తో వ్యక్తిగతంగా సమస్యను వివరించడం మంచిది. అలా కుదరనప్పుడు కుటుంబసభ్యులతో గాని, మీకు బాగా దగ్గరి వ్యక్తులతో గాని పంచుకోండి. మీరు కొంత సమయం మీ కోసం కేటాయించుకుని విశ్రాంతి తీసుకోండి. మీరు రోజూ చేసే పనులు కూడా చెయ్యలేక ఇబ్బంది పడుతుంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. కొందరిలో ఏ కారణం లేకుండానే ఏడవటం, వెంటనే సంతోషంగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. డెలివరీ సమయంలో అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. హార్మోన్‌ల మార్పుల వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది.
డెలివరీ అయిన వారం రోజుల్లోనే పుట్టిన బిడ్డతో అనుబంధం ఏర్పడటం చాలా అరుదు. నెమ్మదిగా పాలు ఇవ్వడం అలవాటు అయిన తర్వాత ఆ అనుబంధం బలపడుతుంది. మీ బిడ్డను చూసుకోవడంలో అనుభవం ఉన్న వాళ్లకు లేదా ఇంట్లో పెద్దవాళ్లకు మీ సమస్యను వివరించి వారి సాయం తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన అందరికీ ఒకే రీతిలో ఉండకపోవచ్చు. తలనొప్పి, మెడనొప్పి, మగత, కడుపునొప్పి, రాత్రులు చెమటలు పట్టడంలాంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. చాలామందికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నా, ఎవరితోనైనా చెబితే ఏమనుకుంటారో అని చెప్పరు. పదిమందిలో ఒకరికి ఇలా ఉంటుంది. ప్రసవానంతరం ఇలాంటి ఒత్తిడులు చాలామందిలో ఉంటాయి. కొంతమంది కౌన్సెలింగ్ లేదా మందులతో మామూలుగా అవుతారు.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment